iDreamPost
android-app
ios-app

అమెరికాలో భారతీయులపై ఆగని దారుణాలు.. ఇండియన్‌ స్టూడెంట్‌ హత్య

  • Published Nov 24, 2023 | 11:58 AM Updated Updated Nov 24, 2023 | 11:58 AM

ఉన్నత విద్య, ఉద్యోగం కోసం చాలా మంది భారతీయులు విదేశాలకు మరీ ముఖ్యంగా అమెరికా వెళ్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో అగ్రరాజ్యంలో భారతీయులపై వరసగా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..

ఉన్నత విద్య, ఉద్యోగం కోసం చాలా మంది భారతీయులు విదేశాలకు మరీ ముఖ్యంగా అమెరికా వెళ్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో అగ్రరాజ్యంలో భారతీయులపై వరసగా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..

  • Published Nov 24, 2023 | 11:58 AMUpdated Nov 24, 2023 | 11:58 AM
అమెరికాలో భారతీయులపై ఆగని దారుణాలు.. ఇండియన్‌ స్టూడెంట్‌ హత్య

విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించి.. జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని.. అత్యున్నత శిఖరాలు అందుకోవాలని భావించి ఎంతో మంది అప్పు చేసి మరీ పరాయి దేశాలకు వెళ్తుంటారు. భారతీయులు అత్యధికంగా వెళ్లే విదేశాల్లో అమెరికా ముందు వరుసలో ఉంటుంది. మన దేశం నుంచి చాలా మంది ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అగ్రరాజ్యం వెళ్తున్నారు. మన వాళ్లకి అమెరికా అంటే భూతల స్వర్గం. అయితే ఈ మధ్య కాలంలో అమెరికా వెళ్లిన భారతీయులు హత్యలకు గురవ్వడం, ప్రమాదాల్లో మృతి చెందుతున్న సంఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా అమెరికాలో మరో దారుణం వెలుగు చూసింది. భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ వివరాలు..

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన 26 ఏళ్ల విద్యార్థి ఆదిత్య అద్లాఖాను కారులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి అతడిపై కాల్పులు జరిపారు. నవంబర్‌ నెల మొదటి వారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన భారతీయ విద్యార్ధి ఆదిత్య అద్లాఖా.. యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీ మెడికల్ స్కూల్‌‌లో మాలిక్యులర్ అండ్ డెవలప్‌మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్‌ నాలుగో ఏడాది చదువుతున్నట్టు అధికారులు తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఆదిత్యను సిన్సినాటీ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లో చికిత్స నిమిత్తం చేర్చారు. అక్కడ ట్రీట్‌మెంట్‌ పొందతూ.. ఆదిత్య మృతిచెందినట్టు హమిల్టన్ కౌంటీ కోరోనర్ ఆఫీస్ ఓ ప్రకటనలో తెలిపింది.

సిన్సినాటి పోలీస్ లెఫ్టినెంట్ జోనాథన్ కన్నింగ్‌హామ్ మాట్లాడుతూ.. నవంబర్ 9న వెస్ట్రన్ హిల్స్ వయాడక్ట్ ఎగువ డెక్‌లో ఓ వాహనం అడ్డగోలుగా వచ్చి.. అక్కడే ఉన్న గోడను ఢీకొట్టింది. దగ్గరకు వెళ్లి చూడగా వాహనం లోపల కాల్పులకు గురైన ఒక వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలిపారు. ఈ ఘటన నవంబర్‌ 9, ఉదయం 6.20 గంటల ప్రాంతంలో జరిగినట్లు పేర్కొన్నారు. అటుగా వెళ్తున్న వాహనదారులు కొందరు.. 911కి కాల్ చేసి, బుల్లెట్ రంధ్రాలున్న కారులో ఓ వ్యక్తి గాయాలతో ఉన్నట్టు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపాడు.

గాయాలతో ఉన్న ఆదిత్య అద్లాఖాను సిన్సినాటీ మెడికల్ సెంటర్‌కు తరలించారని, అప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో రెండు రోజుల తరువాత చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని స్థానిక మీడియా నివేదికలు తెలిపాయి. ఆదిత్య.. పెద్దపేగులో అల్సర్లు, నొప్పికి న్యూరోఇమ్యూన్ కమ్యూనికేషన్ పరస్పర చర్యలు ఎలా దోహదపడతాయో అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నాడు.. అతడి మృతిపై సిన్సినాటి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశాడు.

ఉత్తరాది రాష్ట్రానికి చెందిన ఆదిత్య అద్లాఖా ఉన్నత విద్య, పరిశోధనల కోసం అమెరికా వెళ్లాడు. ఢిల్లీ యూనివర్సిటీ రామ్‌జాస్ కాలేజీ నుంచి 2018లో జంతుశాస్త్రంలో డిగ్రీ, 2020లో ఎయిమ్స్‌ నుంచి ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు ఆదిత్య. అదే ఏడాది మాలిక్యూలర్ బయాలజీలో పరిశోధనల కోసం సిన్సినాటీ యూనివర్సిటీలో ప్రవేశం పొందాడు.

ఆదిత్య వెళ్తోన్న కారును ఫాలో చేసిన దుండుగులు అతడిపై పలుసార్లు కాల్పులు జరిపారు. అయితే ఈ దారుణానికి పాల్పడింది ఎవరు.. ఎందుకు చేశారు అనే విషయాలు తెలియలేదు. ఇక ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కుమారుడు ఇలా దారుణ హత్యకు గురి కావడంతో.. అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా ఏడుస్తున్నారు.