Venkateswarlu
Venkateswarlu
నల్గొండలో ఓ భారీ అవినీతి తిమింగలం బయటపడింది. అవినీతి చేసి కోట్లు గడించిన ఓ ఎమ్మార్వో గుట్టు రట్టయింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు అతడి ఇంట్లో సోదాలు చేయగా భారీగా నగదు, బంగారం దొరికాయి. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాకు చెందిన మర్రిగుడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు హైదరాబాద్‌లోని వనస్థలీపురంలో ఉన్న మహేందర్ రెడ్డి నివాసంతో పాటు మొత్తం 15 చోట్ల సోదాలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో భారీగా నగదు, బంగారు అభరణాలు లభించాయి. సోదాలు చేస్తున్న అధికారులకు ఓ ట్రంక్ పెట్టె దొరికింది. వారు దాన్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. దాన్నిండా 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. ఆ ట్రంక్‌పెట్టె నిండా 2 కోట్ల రూపాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు! సోదాల్లో కిలోల కొద్దీ బంగారం అధికారులకు దొరికినట్లు సమాచారం. మహేందర్ రెడ్డి పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు కూడా గుర్తించారు. కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా సోదాలు జరుగుతున్నాయి. సోదాలు ముగిసే సమయానికి మరింత నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ట్రంకు పెట్టెలో డబ్బులు ఉన్న దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సదరు ఎమ్మార్వోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, భారీగా అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన మర్రిగుడ తహసీల్దార్ మహేందర్ రెడ్డిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.