కుక్కను కాపాడాలనుకున్నారు.. ముగ్గురూ బలయ్యారు!

ఒక్కోసారి మంచి చేయబోతే చెడు ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా వాహనదారులు రోడ్లపై తమకు ఎదురొచ్చే జంతువుల్ని తప్పించబోయి ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నేషనల్‌ హైవేపై స్కూటీపై వెళుతున్న ముగ్గురు తమ వాహనానికి అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయారు. ఈ నేపథ్యంలోనే వారి స్కూటీ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. దీంతో ముగ్గరూ మృత్యువాత పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌, రామ్‌పూర్‌ సిటీలో ఉన్న ఢిల్లీ-నైనిటల్‌ నేషనల్‌ హైవే 87పై ముగ్గురు మైనర్లు స్కూటీపై వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కుక్క వారి స్కూటీ ముందు టైర్‌కు అడ్డంగా వచ్చింది. ఆ ఊహించని పరిణామంతో స్కూటీ నడుపుతున్న మైనర్‌ కొంత భయపడిపోయాడు. కుక్కను రక్షించాలన్న మంచి ఉద్దేశ్యంతో స్కూటీని పక్కకు తిప్పాడు. దీంతో స్కూటీ వస్తున్న వేగానికి అదుపు తప్పి, కిందపడింది. స్కూటీపై ఉన్న ముగ్గురూ గాల్లోకి ఎగిరి, బలంగా నేలపై పడ్డారు.

ముగ్గురి తలలకు గాయాలయ్యాయి. అదే రోడ్డుపై వెళుతున్న వాహనదారులు వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వారి తలలకు బలమైన గాయాలు అవ్వటం వల్ల వచ్చే మార్గంలోనే చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వాళ్లను సయ్యద్‌ జియాన్‌, మహద్‌ అహద్‌, మహద్‌ ఉమైర్‌లుగా గుర్తించారు. ఆ ముగ్గురూ ప్రాణ స్నేహితులని, ముగ్గురిదీ గంజ్‌ ప్రాంతమని తెలిపారు. మరి, కుక్కను రక్షించబోయి ముగ్గురు మైనర్లు ప్రాణాలు పోగొట్టుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments