సామాన్యులకు ఊరట.. భారీగా దిగి వచ్చిన టమాటా ధర

ఈ ఏడాది టమాటా పండించిన రైతుల పంట పండింది. వ్యవసాయం చేసి రైతులు కోటీశ్వరులు అవ్వడం కల్ల అనుకున్న మాటలు ఈ ఏడాది టమాటా పంట రూపంలో నిజం అయ్యాయి. టమాటాల సాగు మీద లక్షలు, కోట్ల రూపాయలు ఆర్జించారు అన్నదాతలు. ఒకానొక సమయంలో కిలో టమాటా ధర ఏకంగా 300 రూపాయలకు చేరువయ్యింది. జూలై నుంచి టమాటా ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర డబుల్‌ సెంచరీ దాటింది. దాంతో సామాన్యులు టమాటా కొనాలంటేనే భయపడ్డారు. అయితే జూలై నుంచి ఆగస్ట్‌ మొదటి వారం వరకు రాకెట్‌ వేగంతో దూసుకుపోయిన టమాటా ధర గత వారం రోజుల నుంచి దిగి వస్తోంది. నేడు టమాటా ధర భారీగా పడిపోయింది. దాంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

గత వారం రోజుల నుంచి రైతు బజార్లు, కూరగాయల మార్కెట్‌కు టమాటాలు పోటెత్తుతున్నాయి. దాంతో ధర దిగి వస్తోంది. ఇక మదనపల్లె మార్కెట్‌లో ఏకంగా కిలో టమాటా ధర 33 రూపాయలకు పడిపోయింది. మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో డబుల్‌ సెంచరీ దాటిన టమాటా ధర గత రెండు రోజులుగా దిగి వస్తోంది. వర్షాలు తగ్గి.. దిగుబడి పెరగడంతో.. టమాటా ధరలు ఒక్కసారిగా దిగి వస్తోన్నాయి. రెండు రోజుల్లోనే టమాటా ధర ఏకంగా 80 శాతం పడిపోయింది. ప్రస్తుతం టమాటా బాక్స్‌ ధర కూడా 600-1000 రూపాయలు పలుకుతోంది. టమాటా రేటు దిగి రావడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Show comments