iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధర!

  • Published Jul 08, 2023 | 11:37 AM Updated Updated Jul 08, 2023 | 11:40 AM
  • Published Jul 08, 2023 | 11:37 AMUpdated Jul 08, 2023 | 11:40 AM
పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధర!

మన దేశంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బంగారం తప్పనిసరి. ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా బంగారం కేవలం ఆభరణాల కోసం మాత్రమే కాక.. పెట్టుబడి సాధనంగానూ మారిపోయింది. మన దగ్గర బంగారానికి భారీ డిమాండ్‌ ఉండటంతో.. ప్రతి ఏటా మన దేశం టన్నుల కొద్ది బంగారం దిగుమతి చేసుకుంటుంది. భారతీయ మహిళల వద్ద ఉన్న బంగారం ప్రపంచ బ్యాంకు దగ్గర సైతం లేదని పలు నివేదికలు చెబుతుండడం గమనార్హం. డిమాండ్‌కు తగ్గట్టే పసిడి రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా బంగారం రేట్లు దిగి వస్తున్నాయి. శుక్రవారం రోజున అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగి వచ్చినా.. దేశీయంగా మాత్రం పెరిగింది.

కానీ నేడు అనగా శనివారం మాత్రం దేశీయ మార్కెట్‌లో వెండి ధర భారీగా తగ్గగా.. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ​కనుక పసిడి కొనాలనుకునేవాళ్లు ఇప్పుడు త్వరపడితే.. మంచిది అంటున్నారు. మరి నేడు దేశీయ మార్కెట్‌లో వెండి, బంగారం ధరలు ఎంత మొత్తం దిగి వచ్చాయి.. హైదరాబాద్‌, ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయి అంటే…

నేడు హైదరాబాద్‌లో పసిడి ధర స్వల్పంగా దిగి వచ్చింది. నేడు భాగ్యనగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ పసిడి రేటు 10 గ్రాముల మీద రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ. 54,150 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు 10 గ్రాముల మీద రూ. 90 తగ్గి ప్రస్తుతం రూ. 59,070 పలుకుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర దిగి వచ్చింది. హస్తినలో 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ.100 తగ్గి రూ. 54,300 పలుకుతోంది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన గోల్డ్ రేటు ఢిల్లీలో 10 గ్రాముల మీద రూ. 100 తగ్గి రూ. 59,220 వద్ద ట్రేడవుతోంది.

ఇక వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. నేడు వండి ధర భారీగా దిగి వచ్చింది. ఇక నేడు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 700 తగ్గి ప్రస్తుతం రూ. 72,300 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఢిల్లీతో పోలిస్తే.. హైదరాబాద్‌లో వెండి ధర ఎక్కువగా దిగి వచ్చింది. భాగ్యనగరంలో కిలో వెండి రేటు ఏకంగా రూ.1000 పడిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 75, 700 పలుకుతోంది. ఇక ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, బంగారం ధర మాత్రం హైదరాబాద్‌లో తక్కువగా ఉంటుంది. అందుకు ఈ రెండు ప్రాంతాల్లో ఉండే ట్యాక్సులు, ఇతర అంశాలు కారణంగా మారతాయి.