iDreamPost
android-app
ios-app

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా కంపెనీకి సీఎఫ్​వోగా భారత సంతతి వ్యక్తి!

  • Author singhj Published - 10:51 AM, Tue - 8 August 23
  • Author singhj Published - 10:51 AM, Tue - 8 August 23
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా కంపెనీకి సీఎఫ్​వోగా భారత సంతతి వ్యక్తి!

విద్య, వైద్యం, వ్యాపారం.. ఇలా అన్ని రంగాల్లోనూ భారతీయులు దూసుకెళ్తున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో దేశంలో అక్షరాస్యత బాగా పెరిగింది. రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో మనోళ్లు ముందుంటున్నారు. అందుకే ఐటీ సహా మిగిలిన చాలా రంగాల్లో ఇప్పుడు భారతీయులదే హవా. అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, యూకే లాంటి ధనిక దేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకొని.. అక్కడ జాబ్స్ చేస్తున్న ఇండియన్స్ సంఖ్య అధికంగానే ఉంది. ఉద్యోగాలు చేయడమే కాదు.. ఆయా కంపెనీల్లో అత్యున్నత పదవులను చేపడుతూ భారతీయులు అందరిలోనూ స్ఫూర్తిని నింపుతున్నారు.

టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో అయిన సుందర్ పిచాయ్ దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సిస్టమ్స్ సీఈవో శంతను నారాయణ్, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ వరకు ఎన్నో టాప్ కంపెనీలను భారతీయులు ముందుండి నడిపిస్తున్నారు. ఈ కోవలోనే మరో ఇండియన్ ఒక అత్యున్నత పదవిని దక్కించుకున్నారు. అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజమైన టెస్లాకు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్​ (సీఎఫ్​వో)గా భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా నియమితులయ్యారు. టెస్లాలో ప్రస్తుతం చీఫ్ అకౌంటెంట్​గా పనిచేస్తున్న తనేజా.. ఇకపై ఆ పదవిలో కొనసాగుతూనే సీఎఫ్​వోగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు

టెస్లా కంపెనీలో 13 ఏళ్లుగా సీఎఫ్​వోగా కొనసాగుతున్న జాచరీ కిర్కాన్ ఆ పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఆయన స్థానంలో తనేజాను నియమించినట్లు టెస్లా వెల్లడించింది. ఇన్నేళ్లు కంపెనీకి జాచరీ కిర్కాన్ అందించిన సేవలకు సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. అయితే కిర్కాన్ టెస్లాను ఎందుకు వీడారనే దానికి కారణం తెలిసిరాలేదు. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఉండేందుకు, బాధ్యతల బదిలీ కూడా సులభతరం చేసేందుకు ఈ ఏడాది ఆఖరు వరకు కిర్కాన్ తన పదవిలో ఉంటారని సమాచారం. టెస్లాలో ఇన్నేళ్లు తాను చేసిన పనికి, నేర్చుకున్న దానికి ఎంతగానో గర్వపడుతున్నానని లింక్డ్​ఇన్ పోస్టులో వివరించారు కిర్కాన్.