iDreamPost
android-app
ios-app

ఆ రెండు బ్యాంకులు కనిపించవు.. లైసెన్స్‌ రద్దు చేసిన RBI.. మీ డబ్బులుంటే త్వరపడండి!

  • Published Jul 12, 2023 | 9:07 AM Updated Updated Jul 12, 2023 | 9:07 AM
  • Published Jul 12, 2023 | 9:07 AMUpdated Jul 12, 2023 | 9:07 AM
ఆ రెండు బ్యాంకులు కనిపించవు.. లైసెన్స్‌ రద్దు చేసిన RBI.. మీ డబ్బులుంటే త్వరపడండి!

దేశంలోని బ్యాంకులన్నింటికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) హెడ్‌ లాంటిది. దేశంలోని బ్యాంక్‌లన్ని ఆర్బీఐ రూల్స్‌కి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించాలి. ఈ క్రమంలో ఆర్‌బీఐ దేశంలోని బ్యాంకులపై నిఘా పెడుతుంది. మానటరీ రెగ్యులేషన్‌ నియమాలు అతిక్రమించడం, బ్యాంకింగ్‌ కార్యకలాపాలు సరిగా నిర్వహించుకండా దివాలా అంచుకు చేరుకొన్న బ్యాంకులకు సంబంధించి ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు అతిక్రమించిన బ్యాంకులకు భారీగా పెనాల్టీలు విధిస్తుంది. అలానే పనితీరు సరిగా లేని బ్యాంకుల లైసెన్స్‌లు కూడా రద్దు చేస్తోంది. ఇక తాజాగా ఆర్బీఐ రెండు బ్యాంకుల లైసెన్స్‌ రద్దు చేసింది. ఇకపై ఇవి కనిపించవు. దాంతో ఈ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉన్న ఖాతాదారులు తమ డబ్బుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు బ్యాంక్‌లు జూలై 11, 2023 నుంచే కార్యకలాపాలు కొనసాగించవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది.

నియమాలు అతిక్రమించిన బ్యాంకులపై కొరఢా ఝులిపిస్తోన్న ఆర్బీఐ.. తాజాగా మరో రెండు సహకార బ్యాంకులపై వేటు వేసింది. వాటి లైసెన్స్‌ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటిలో ఒకటి శ్రీ శారదా మహిళా కోఆపరేటివ్ బ్యాంక్. ఇది ప్రస్తుతం కర్ణాటక తుమకూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక ఆర్బీఐ లైసెన్స్‌ రద్దు చేసిన మరో బ్యాంక్‌ హరిహరేశ్వర్ సహకార బ్యాంక్. ఇది మహారాష్ట్ర సతారాలోని వాయ్ కేంద్రంగా కార్యకలపాలు నిర్వహిస్తోంది.

ఈ రెండు బ్యాంకుల దగ్గర తగినంత మూలధన నిల్వలు లేకపోవడం సహా.. ఈ బ్యాంకుల నుంచి పెద్దగా ఆదాయ అంచనాలు కూడా లేని కారణంగా.. ఆర్బీఐ ఈ రెండు బ్యాంకుల లైసెన్స్‌ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. . హరిహరేశ్వర్ బ్యాంక్.. జులై 11 నే మూతపడినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇక ఈ బ్యాంకుల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగవని.. డిపాజిట్లు తీసుకోవడం.. రీపేమెంట్లు చేయడం కూడా కుదరదని ఆర్బీఐ వెల్లడించింది.

ఇక హరిహరేశ్వర్‌ సహకారి బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు అయినప్పటికి.. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (డీఐసీజీసీ) కింద ఈ బ్యాంక్ డిపాజిటర్లలో 99.96 శాతం మందికి తమ మొత్తం డబ్బులు తిరిగివస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక శ్రీ శారదా మహిళా బ్యాంక్ విషయానికి వస్తే ఇందులో 97.82 శాతం డిపాజిటర్లు తమ డబ్బులు తిరిగి పొందుతారని వెల్లడించింది. ఇక డీఐసీజీసీ కింద అంటే ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న వారు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తంలో సుమారు రూ.5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే వడ్డీ, అసలు కలిపి రూ.5 లక్షల వరకు తిరిగి కస్టమర్ల చేతికి వస్తాయి.

అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసినా పెద్దగా లాభం ఉండదు. అందుకే డబ్బుల డిపాజిట్‌ చేసే అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక వడ్డీ ఆశకు పోయి.. ఇలాంటి బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తే.. తర్వాత బాధపడాల్సి వస్తుంది. కనుక డబ్బులు డిపాజిట్‌ చేసే సమయంలో.. ఆర్థికంగా బలంగా ఉన్న బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడం ఉత్తమం అంటున్నారు.