P Venkatesh
ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. చివరకు అతడి ప్రేమను అంగీకరించిన ఆ యువతికి ఊహించని షాక్ ఇచ్చాడు.
ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. చివరకు అతడి ప్రేమను అంగీకరించిన ఆ యువతికి ఊహించని షాక్ ఇచ్చాడు.
P Venkatesh
ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు అన్నీఇన్నీకావు. అప్పటి వరకు నువ్వంటే ప్రాణం.. నువ్వు లేకుంటే నేనుండలేనని నమ్మబలికి ఆ తర్వాత ముఖం చాటేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రియుడు మోసపోతే మరికొన్ని సందర్భాల్లో ప్రియురాలు మోసపోతోంది. ప్రేమించేంత వరకు వెంటపడి.. ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే విధంగా ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు ఓ యువకుడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని.. ప్రేమకు ఒప్పుకోకుంటే చంపేస్తానని.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఓ యువకుడు ఆ యువతని పెళ్లి చేసుకుని ఆ ఖరికి నడిరోడ్డుపై వదిలేశాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
పాలేరు పంచాయతీ శేషాపురం గ్రామానికి చెందిన యమున(21) మోతకుంట గ్రామానికి చెందిన అభిరామ్(22) స్థ్థానిక ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదువుకునేవారు. ఈ క్రమంలో అభిరామ్ ప్రేమ పేరుతో యమునను వేధించేవాడు. తనను ప్రేమించకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడు. దీంతో భయపడిపోయిన ఆ యువతి అభిరామ్ ప్రేమను అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఆరో తేదీన తమిళనాడులోని అరుణాచలం దేవస్థానానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు అభిరామ్. అనంతరం ఇంటికి చేరుకున్నారు. తాము పెళ్లి చేసుకున్నామని అభిరామ్ కుటుంబ సభ్యులకు తెలపగా వారు అంగీకరించలేదు.
తమకు చెప్పకుండా.. ఇష్టంలేని పెళ్లి చేసుకున్నారని ఆగ్రహించిన అభిరామ్ కుటుంబ సభ్యులు యమున మెడలోని తాళి తెంచి, చంపుతామని బెదిరించి, ఆమె మొబైల్ ఫోన్, రెండున్నర గ్రాముల బంగారు ఉంగరాన్ని లాక్కుని దాడి చేశారు. ఆ తర్వాత యమునను బైక్ పై తీసుకొచ్చి శేషాపురం సర్వీసు రోడ్డులో వదిలేశారు. చేసేదేంలేక యమున మదనపల్లెలోని స్నేహితురాలివద్దకు చేరుకుని భర్త అభిరామ్‌కు ఫోన్ చేసి తనను తీసుకెళ్లాల్సిందిగా కోరింది. కొన్ని రోజులు అక్కడే ఉండాలని.. త్వరలోనే తీసుకెళ్తానని నమ్మించాడు. కానీ రోజులు గడుస్తున్నా అభిరామ్ మాత్రం రాలేదు. ఫోన్ చేసినా కూడా కట్ చేయడం ప్రారంభించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యమున బంగారుపాళ్యం పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.