తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త ఛైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం 11.44 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ పాలక మండలి ఛైర్మన్గా భూమన ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతల స్వీకరణ తర్వాత 12.30 గంటలకు అన్నమయ్య భవన్లో ఆయన మీడియాతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీటీడీ ఛైర్మన్గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భూమన కృతజ్ఞతలు తెలిపారు. నేటి ఉదయం 9 గంటలకు పద్మావతిపురంలోని తన ఇంటి వద్ద బయల్దేరిన భూమన.. గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గంగమ్మ గుడిలో పూజల తర్వాత అలిపిరి దగ్గర జరిగిన గోపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు టీటీడీ జీఈవో సదా భార్గవి స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు చేరుకున్న భూమన.. టీటీడీ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఇప్పటిదాకా టీటీడీ ఛైర్మన్గా కొనసాగిన వైవీ సుబ్బారెడ్డితో పాటు బోర్డు పదవీకాలం ఈనెల 8వ తేదీతో ముగిసింది. ఇక, భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో తిరుపతి నగరంలో ఆయన అనుచరులు, అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆశీస్సులతో రెండోసారి స్వామి వారి సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. తన తొలి ప్రాధాన్యత సామాన్య భక్తులకే అని ఆయన స్పష్టం చేశారు. హిందూ ధార్మికతను విశ్వవ్యాప్తం చేస్తానని భూమన చెప్పారు. దేవాలయ అభివృద్ధితో పాటు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభతరంగా దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. గతంలో దళిత గోవిందం, పున్నమి గరుడ సేవ, కళ్యాణమస్తు, భక్తులందరికీ అన్నప్రసాద వితరణ వంటి సంస్కరణలు తీసుకొచ్చానని భూమన గుర్తుచేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు రోజా, అంబటి రాంబాబు, విప్ చెవిరెడ్డి హాజరయ్యారు.