తిరుమలను కలియుగ వైకుంఠంగా చెప్పుకుంటారు. ఇక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వరుడ్ని దర్శించుకునేందుకు ప్రజలు వ్యయ ప్రయాసలకు ఓర్చి సుదూరాల నుంచి తిరుపతికి వస్తుంటారు. అక్కడి నుంచి తిరుమల కొండ మీదకు రోడ్డు ద్వారానో లేదా నడక మార్గంలో చేరుకుంటారు. సొంత వాహనాలు, అద్దె వాహనాలు లేదా ఆర్టీసీ బస్సుల్లో తిరుమల కొండ మీదకు చేరుకోవచ్చు. ఇక, కొండ మీదకు నడక మార్గంలో వెళ్లేందుకు రెండు దారులు ఉన్నాయి. అందులో ఒకటి అలిపిరి దగ్గర నుంచి ఉన్న మార్గం. మరొకటి శ్రీనివాస మంగాపురం ఆలయానికి సమీపం నుంచి ఉన్న శ్రీవారి మెట్టు మార్గం.
అలిపిరి మార్గంతో పోల్చుకుంటే శ్రీవారి మెట్ల మార్గంలో ఉన్న మెట్ల సంఖ్య చాలా తక్కువ. ఒక సగటు వ్యక్తి ఈ రూట్ ద్వారా ఒకటిన్నర నుంచి రెండు గంటల్లో కొండ మీదకు చేరుకోవచ్చు. ఈ రెండు మార్గాల ద్వారా వేలాది మంది భక్తులు కొండ పైకి చేరుకొని వెంకన్న దర్శనం చేసుకుంటారు. ఈ ఇరు మార్గాల్లో వెళ్లే భక్తులకు దర్శనం టికెట్లను కూడా అందిస్తోంది టీటీడీ. ఇదిలా ఉంటే.. ఈ నడక మార్గాలు కొండలు, అడువులతో కూడుకున్నవి కావడంతో ఇక్కడ వన్యమృగాలు కూడా సంచరిస్తుంటాయి. దీంతో ఈ రూట్లలో నడిచి వెళ్లే భక్తుల మీదకు కొన్నిసార్లు వన్యప్రాణులు దాడి చేయడం గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అలర్ట్ అయింది. భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకొని పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రత కోసం నడకదారిలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నడక మార్గంలో ప్రతి 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. అటవీ శాఖ, పోలీసు శాఖ, టీటీడీ కలసి నడకదారిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 6 గంటల సమయం వరకు ఘాట్రోడ్డులో టూ వీలర్లను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. పిల్లలతో వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, చిన్నారుల విషయంలో అప్రమత్తత అవసరమని సూచించారు.