శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. దానికి డబ్బులు ఇవ్వొద్దు, ఫ్రీగానే!

TTD EO Dharma Reddy: డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ద్వారా భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

TTD EO Dharma Reddy: డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం ద్వారా భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి.. నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. క్యూలైన్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. ఇక తిరుమల స్వామి వారికి వచ్చే ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. వేసవి కావడంతో.. ఈ రెండు నెలలు తిరుమలలో భారీ రద్దీ ఉంటుంది. చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలి వస్తారు. స్వామివారి దర్శనం, ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొంటారు. శ్రీవారి సన్నిధిలో భక్తులు స్వచ్ఛందంగా సేవ చేసే అవకాశం కూడా ఉంది. గతంలో శ్రీవారి సేవకులుగా కొందరికే అవకాశం దక్కేది.. ఇప్పుడు టీటీడీ ఆ పద్దతిని మార్చింది. ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవకులు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఇస్తోంది. ప్రతి నెలా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల ఎందరికో స్వామి వారికి సేవ చేసుకునే అవకాశం లభిస్తోంది.

ఈ క్రమంలో తాజాగా టీటీడీ శ్రీవారి భక్తులకు అలర్ట్‌ జారీ చేసింది. శ్రీవారి సేవకులుగా బుక్‌ చేసుకునేందుకు గాను ఎలాంటి డబ్బులు చెల్లించవద్దని.. ఉచితంగానే పొందవచ్చని పేర్కొంది. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుతూ.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు.. శ్రీవారి సేవకుల కోటకు సంబంధించి ఆన్‌లైన్‌‌లో విడుద‌ల చేసిన వెంట‌నే అన్ని తేదీలు బ్లాక్ అవుతున్నాయని ఫిర్యాదు చేశారు. బుక్ చేసుకునే సమయంలో బఫరింగ్ అవుతోందని.. దాంతో పారదర్శకత లోపించిందనే అనే అనుమానాలు వస్తున్నాయి అని తెలిపారు భక్తులు.

అందుకు ఈవో ధర్మారెడ్డి బదులిస్తూ.. శ్రీవారి సేవ ఆన్‌లైన్‌ అప్లికేషన్ ప్రాసెస్‌ ఎంతో పారదర్శకతతో రూపొందించామని.. దీనిలో ఎటువంటి అనుమానాలకు తావు లేదన్నారు. శ్రీవారి సేవ చేయాలనుకునే వారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులకు డబ్బులు ఇవ్వొద్దని.. ఏదైనా సాంకేతిక స‌మ‌స్య‌లు ఉంటే ప‌రిష్క‌రిస్తామని ఈ సందర్భంగా ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఉచితంగానే శ్రీవారి సేవ చేసేందుకు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా కొందరు భక్తులు.. తిరుమల శ్రీవారి ఆలయం వెండి వాకిలి నుంచి బంగారు వాకిలి దగ్గర తోపులాట జరుగుతోందని ఫిర్యాదు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్ల‌ల ఇబ్బంది ప‌డుతున్నారన్నారు. శ్రీ‌వారి ఆల‌యం మ‌హాద్వారం నుంచి బంగారు వాకిలి వ‌ర‌కు ఒకే క్యూ లైన్ విధానంలో భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నామన్నారు ఈవో ధర్మారెడ్డి. విజిలెన్స్‌, ఆల‌య సిబ్బందికి శిక్ష‌ణ ఇచ్చి భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు.

అంతేకాక తిరుమ‌ల‌లో ప్రైవేట్ హోటళ్ల దోపిడి దారుణంగా ఉందని.. అధిక రేట్లు వ‌సూలు చేస్తున్నారని.. అలాగే అఖిలాండం వ‌ద్ద వీధి వర్తకులు భ‌క్తుల‌ను ఇబ్బంది పెడుతున్నారని కొందరు భక్తులు ఈ సందర్భంగా ధర్మారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అందుకు ఆయన బదులిస్తూ.. ప్రైవేట్ హోటళ్ళల్లో రేట్లను నియంత్రించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామని.. దీనిలో భాగంగా ఇప్ప‌టికే ఏపీ టూరిజం భక్తులకు త‌క్కువ అద్దెతో 4 హోటళ్లు కేటాయించామని.. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వీధి వర్తకులను అదుపు చేస్తారన్నారు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కారణంగా సిఫార్సు లెటర్స్‌ని స్వీకరించడం లేదని.. శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా బ్రేక్ టికెట్టు పొంద‌వ‌చ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ ద‌ర్శ‌నం కూడా పొంద‌వ‌చ్చని.. కోడ్ పూర్త‌య్యేంత‌ వ‌ర‌కు ఎలాంటి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వన్నారు. రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం కుదరదని ఈవో ధర్మారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.

Show comments