Dharani
తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే వేలాది మంది భక్తులు.. అక్కడి మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం స్వీకరిస్తుంటారు. అయితే తాజాగా దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో టీటీడీ ఛైర్మన్ దీనిపై స్పందించారు. ఆ వివరాలు..
తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చే వేలాది మంది భక్తులు.. అక్కడి మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం స్వీకరిస్తుంటారు. అయితే తాజాగా దీనిపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో టీటీడీ ఛైర్మన్ దీనిపై స్పందించారు. ఆ వివరాలు..
Dharani
తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులకు వడ్డించే ఆహారం నాణ్యత సరిగ్గా లేదంటూ కొందరు గొడవ చేయడం కలకలం రేపింది. సిబ్బంది వడ్డించిన అన్నప్రసాదం ఉడకలేదని, మరికొంత ముద్దగా ఉందని విమర్శలు చేస్తూ.. వాగ్వాదానికి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. తాజాగా ఈ వివాదంపై టీటీడీ చైర్మన్ భుమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ’’ఏళ్లుగా వెంకన్న భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నాం. ఇన్నేళ్లల్లో ఏనాడూ ఏ ఒక్కరూ అన్నప్రసాదాన్ని విమర్శించడం చూడలేదు. తిరుమల అన్నదానానికి సంబంధించి ఇంత వరకు ఒక్క ఫిర్యాదు రాలేదు. కానీ తాజాగా వెంగమాంబ అన్నప్రసాదాలయంలో కొంతమంది అన్నం నాణ్యత గురించి అల్లరి చేసినట్లు మాకు సమాచారం వచ్చింది. వచ్చిన వాళ్ల ఎమోషన్ ను గుర్తుంచుకోవాలి‘‘ అన్నారు.
’’అలా అని మేం దీన్ని తేలికగా తీసుకోవడం లేదు. తప్పు జరిగితే సరిదిద్దుకోవడానికి టీటీడీ సిద్ధంగా ఉంటుంది. కానీ కొందరు పని గట్టుకుని ఆందోళన చేయాలని, అప్రతిష్ట పాలు చేయాలని భావిస్తున్నారు. అందుకే మిగతా భక్తులను రెచ్చగొట్టి.. ఆందోళన చేయించారు. ఇది సరైంది కాదు. పైగా దీన్ని వైరల్ చేస్తున్నారు. ఆ సమయంలో దాదాపు ఏడు వందలమంది ఉన్న ఆ హాల్లో కేవలం పదిహేనుమంది మాత్రమే అన్నప్రసాదాన్ని విమర్శించడం చూస్తుంటే దానివెనుక ఏదో దురాలోచన ఉన్నట్లు తెలుస్తోంది‘‘ అన్నారు.
’’అన్నప్రసాదానికి సైతం వంకలుపెట్టడం గతంలో ఎన్నడూ లేదు. మళ్లీ మళ్లీ చెబుతున్నాం.. తప్పులు జరిగితే సరిదిద్దుకోవడానికి టీటీడీ ఎప్పటికి సిద్ధంగా ఉంటుంది. అంతేకానీ తప్పుడు ప్రచారాలు మాత్రం చేయడం మంచిది కాదు‘‘ అని తెలిపారు. ఇది కేవలం రాజకీయ కోణంలో కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ కొట్టి పడేసింది. ఈ ఘటనపై టీటీడీ డిప్యూటీ ఈవో రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది.
తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులు అక్కడి మాతృశ్రీ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం స్వీకరిస్తుంటారు. వెంగమాంబ అన్నదాన సత్రంలో మొత్తం నాలుగు హాల్స్ ఉండగా, ఒకసారికి దాదాపు 4 వేల మంది భోజనం (మహా ప్రసాదం) స్వీకరించే అవకాశం ఉంది. ఇలా ఒక్క రోజుకి మొత్తం నలభై వేలనుండి యాభై వేలమందికి పైగా భక్తులు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తుంటారు. దీన్ని మహాప్రసాదంగా భావిస్తుంటారు. అలాంటి అన్నదానంపై ఇలా విమర్శలు చేయడం దారుణం అంటున్నారు భక్తులు.