Tirupathi Rao
Tirupathi Rao
తిరుమల కాలినడక మార్గంలో భద్రత విషయంలో భక్తుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఒక అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భక్తుల భద్రతకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా సమావేశంలో భక్తుల భద్రత విషయంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మీడియాకి వెల్లడించారు. ఇకపై కాలినడక భక్తులకు ఒక్కొక్కరికి ఒక చేతికర్ర ఇవ్వనున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇటీవల తిరుమల కాలినడక మార్గంలో లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో చనిపోయింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అటవీ శాఖ టీటీడీకి పలు కీలక సూచనలు చేసింది. వన్య ప్రాణుల దాడుల నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అంటూ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల అమలులో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అందరూ ఈ నిర్ణయాలను తప్పక అనుసరించాలని కోరారు. అటవీ శాఖ నింబధనల ప్రకారమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.