తిరుమల కొండపై వన్యజీవుల సంచారం ఎప్పటినుంచో ఉంది. కొండపై నడక దారిలో వెళ్లే భక్తులకు చిరుత పులులు, ఎలుగుబంట్లు లాంటి జంతువులు తారసపడుతుంటాయి. కొన్నిసార్లు ఈ జంతువులు భక్తులపై దాడికి దిగిన ఘటనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల అలిపిరి నడక దారిలో వన్యమృగాల దాడులను అరికట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నడుం బిగించింది. వెంకన్న దర్శనానికి నడక దారిలో వచ్చే భక్తులకు చేతికర్రలు అందించడంతో పాటు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరికొన్ని చర్యలు కూడా తీసుకుంటోంది.
కొండపై వన్యమృగాల దాడులను అరికట్టేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా నడక మార్గంలోని దుకాణాల్లో పండ్లు, కూరగాయలు విక్రయించకూడదని వ్యాపారులను ఆదేశించింది టీటీడీ. భక్తులు పండ్లు, కూరగాయల్ని కొని కోతులు, ఇతర సాధు జంతువులకు తినిపించడం వల్ల అవి అధిక సంఖ్యలో వస్తున్నాయని.. వాటి కోసం పులులు కూడా రావడంతో సమస్య తలెత్తుతోందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నడక మార్గంలోని దుకాణాల యజమానులతో ఈవో ధర్మారెడ్డి శుక్రవారం సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
క్రూరమృగాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం తెలిపేందుకు వీలుగా అటవీ, ఆరోగ్య శాఖల అధికారులతో పాటు విజిలెన్స్ ఆఫీసర్ల ఫోన్ నంబర్లను బోర్డుల మీద ప్రదర్శిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. భక్తుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అన్నారు. నడక దారిలో పారిశుద్ధ్యాన్ని కూడా మెరుగుపరుస్తున్నామని.. దుకాణాల దగ్గర తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా పడేయడానికి రెండు డబ్బాలు పెట్టుకోవాలని ఆదేశించారు. కాగా, కొండ మీద సంచరిస్తున్న చిరుత పులులను బంధించి దూర ప్రాంతాలకు తరలించడానికి టీటీడీ బోన్లను ఏర్పాటు చేయగా.. నెల రోజుల వ్యవధిలోనే రెండు దొరికాయి.