తల్లిదండ్రులు.. తమ బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ముఖ్యంగా కుమారుడి విషయంలో వారి ఆశలు కాస్తా ఎక్కువగా ఉంటాయి. వృద్ధాప్యంలో తమను చూసుకుంటాడని ఆ పేరెంట్స్ భావిస్తుంటారు. అయితే తాము అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలే.. కళ్లముందే చనిపోతే.. ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. ఓ తల్లికి అలాంటి గుండెకోత మిగిలిగింది. మంచం పట్టిన తండ్రిని, వృద్దురాలైన తల్లిని చూసుకుంటున్న ఓ యువకుడు అనుకోని ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అది కూడా కన్న తల్లి కళ్లేదుటే మృత్యువాత పడ్డాడు. కుమారుడి మరణాన్ని కళ్లార చూసిన ఆ మాతృమూర్తి అస్వస్థతకు గురైంది. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది.
పార్వతీపురంలోని బంగారమ్మ కాలనీకి చెందిన జి.రాము, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రాము రైల్వే లో విధులు నిర్వహించి.. రిటైర్డ్ అయ్యారు. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యాయి. ప్రస్తుతం పెద్ద కుమారుడు హరి(35) తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. తండ్రి పక్షవాతంతో మంచాన పడ్డారు. ఆయనకు సేవలు చేస్తూ.. అమ్మను చూసుకుంటూ హరి కాలం గడపుతున్నాడు. శుక్రవారం తల్లిని తీసుకుని హరి.. సమీపంలో ఉన్న గుడికి వెళ్లాడు. ఈ క్రమంలో బెలగాం రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా బొబ్బిలి వైపు నుంచి వచ్చిన గూడ్స్ ఢీ కొట్టింది. రైలు వేగానికి లక్ష్మి కూడా ఒకవైపు తుళ్లి పడింది. అయినా లేచి పరుగున వెళ్లి చూసేరికి కొడుకు పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. కొడుకు మృతదేహాన్ని చూసి ఆమె అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.