నేటికాలంలో ఆర్ధిక, వివాహేతర సంబంధాల కారణంగా జరిగే నేరాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న నేరాలకు ఎక్కువ భాగం ఈ రెండే కారణం. ముఖ్యంగా డబ్బులు, ఆస్తి మనుషుల్లోని మానవత్వన్ని బంధాన్ని చంపేస్తుంది. ఇలా ఆస్తుల కోసం తోడబుట్టిన వారే ఒకరినొకరు చంపుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం గుంటూరు జిల్లాలో ఆస్తి వివాదంలో సొంత బాబాయి కుటుంబంలోని ముగ్గురిని చంపేశారు. ఇటీవలే మెదక్ జిల్లాలో డబ్బుల కోసం సొంత తల్లినే చంపేశాడు ఓ కుమారుడు. తాజాగా నెల్లూరు జిల్లాలో కోడలితో సహా ముగ్గురిని ఓ మామ అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట గ్రామానికి చెందిన మందాటి మధుసూదన్(31) రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆయనకు మౌనిక(30) అనే యువతితో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మన్విత్ అనే ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇక మధుసూదన్ అనారోగ్య కారణాలతో పది రోజుల కిందటే మరణించారు. మరో రెండు రోజుల్లో ఆయన ఉత్తరక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున మధుసూధన్ భార్య మౌనిక, ఆమె తండ్రి కృష్ణయ్య(60), అమ్మమ్మ అంబటి శాతమ్మ(74) నిద్రిస్తుండగా హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం బుచ్చిరెడ్డి పాలెం నుంచి మౌనిక తల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిశీలించగా మౌనికతో పాటు ఆమె తండ్రి, అమ్మమ్మ మృతదేహాలు రక్తపు మడుగుల్లో పడి ఉన్నాయి.
వీరిని మధుసూదన్ తండ్రి మాల్యాద్రి, సోదరుడు మౌలాలి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ముందు మౌనిక నిద్రిస్తున్న ఇంటి నుంచి అరుపులు, కేకలకో పెనుగులాట జరిగినట్లు ఈ సంఘటన ప్రదేశంలో ఆనవాళ్లను బటి తెలుస్తోంది. మృతదేహాల ముఖాలపై రాడ్డు, కట్టెలతో కొట్టి తీవ్రంగా గాయపరిచిన గుర్తులు కనిపించాయని సమాచారం. మాల్యాద్రి, మౌలాలి పరారీలో ఉన్నారు. వారు మధుసూధన్ కుమారుడు మన్విత్ కూడా తమ వెంట తీసుకెళ్లారని సమాచారం. అయితే మధుసూధన్ తల్లి ధనమ్మను పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ముగ్గురి హత్యతో ఆ గ్రామంలో భయానక వాతావరణం కనిపించింది. ఈ ఘటన గురించి సమాచారం తెలియగానే జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. పోలీసుల జాగిలాన్ని రప్పించి.. ఆధారాలు సేకరించారు.
ఇదీ చదవండి: కానిస్టేబుల్ రమేశ్.. ఆ ఒక్క పని చేసి ఉంటే బతికేవాడు!