తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. నడకదారిలో కొండ పైకి వచ్చే శ్రీవారి భక్తులకు సులభతరంగా ఉండేందుకు సరికొత్త లగేజీ విధానాన్ని తీసుకొచ్చామని తెలిపింది. లగేజీ తరలింపు కోసం గతంలో మాన్యువల్ పద్ధతిలో నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అధునాతనమైన పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ పద్ధతిని దాతల సహకారంతో అమలు చేస్తున్నామని చెప్పారు. భక్తుల లగేజీని భద్రపరిచే ప్రాంతాల్లో టోకెన్ ఇచ్చే పద్ధతికి టీటీడీ స్వస్తి పలికింది.
లగేజీ కోసం టోకెన్ ఇచ్చే స్థానంలో కొత్తగా క్యూఆర్ కోడ్ విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా వీలైనంత త్వరగా భక్తుల లగేజీ బ్యాగులను ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది బోర్డు. వెంకన్న భక్తులకు సులభతరంగా ఉండేందుకు నడకదారిలో వచ్చే వారి లగేజీని ఉచితంగా తరలించనుంది. లగేజీ కౌంటర్ల దగ్గర ఆలస్యం లేకుండా త్వరగా భక్తులకు అందజేసేందుకు మొత్తంగా 16 ఏరియాల్లో 44 కౌంటర్లలో.. 300 మంది సిబ్బందితో ఈ ప్రక్రియను కొనసాగిస్తామని టీటీడీ పేర్కొంది. ఇకపోతే, వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి పట్టాభిషేక మహోత్సవాలు మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు ఆగస్టు 23 వరకు ఘనంగా జరగనున్నాయి.
పట్టాభిరామస్వామి పట్టాభిషేక ఉత్సవాల సందర్భంగా ఆగస్టు 22న ఉదయం యాగశాల పూజ, ఆ తర్వాత స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఊంజల్ సేవ, సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవను నిర్వహించనున్నారు. ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం మీద శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. ఆ తర్వాత మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహిస్తారు.