స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ.. ఆయన్ను తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తరలించింది. చాలా సేపటి నుంచి సిట్ ఆఫీసులోనే ఉన్న చంద్రబాబుపై సిట్ ఆఫీసర్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌కు సంబంధించి అప్పట్లో జరిగిన విషయాలపై అధికారులు ప్రశ్నలు సంధించారు. అప్పట్లో ఆఫీసర్స్ రాసిన నోట్ ఫైల్స్‌ను చంద్రబాబుకు సీఐడీ చూపించినట్లు సమాచారం. ఇన్వెస్టిగేషన్ తర్వాత చంద్రబాబును విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించే ఛాన్స్ ఉంది. అందుకోసం మరో కాన్వాయ్‌ను కూడా సిద్ధం చేశారు సీఐడీ అధికారులు.
ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబును కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గంటాను స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు. శనివారం ఉదయం విశాఖపట్నంలోని ఆయన ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఏసీపీ వివేకానంద నేతృత్వంలో గంటాను అదుపులోకి తీసుకొని.. ఎండాడలోని దిశ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా, సీఐడీ అధికారుల విచారణలో నోట్ ఫైల్స్‌పై వివరణ కోరగా.. చంద్రబాబు తనకు తెలీదు, గుర్తులేదు అనే సమాధానాలే ఇస్తున్నట్లు తెలుస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమాలు, హవాలా లావాదేవీలపై సీఐడీ అధికారులు వివరించిన సమయంలో చంద్రబాబు తడబాటుకు గురైనట్లు సమాచారం. ముఖ్యంగా తన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధుల మధ్య వాట్సాప్ చాట్‌ను సీఐడీ అధికారులు చంద్రబాబుకు చూపించారట. అయితే తనకు చాటింగ్ గురించి తెలియదని ఆయన అన్నారట. అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సరైన సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. దీంతో ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరు పర్చాక, రిమాండ్ తర్వాత సీఐడీ కస్టడీ కోరొచ్చని సమాచారం.
ఇదీ చదవండి: అసెంబ్లీ సాక్షిగా బాబు స్కామ్‌ను ఆనాడే బయటపెట్టిన CM జగన్