P Krishna
P Krishna
ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రదారుడు, ఏ1 నిందితుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఆదివారం రాత్రి సమయంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో చంద్రబాబును పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ పై ఏపీలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ విజయవాడ కోర్టు వద్ద ఓ టీడీపీ నేత మాత్రం అందరికీ స్వీట్లు పంచుతూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం.. రిమాండ్ కు పంపడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద తమ అధినేతను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ నానా హంగామా సృష్టించారు. ఇదంతా ఒక ఎత్తైతే అక్కడ ఓ సన్నివేశం అందరినీ ఆశ్చర్యపరిచింది. టీడీపీ నేత ఆకులు వెంకటేశ్వరరావు విజయవాడ కోర్టు దగ్గర అందరికీ స్వీట్స్ పంచుతూ సంతోషంలో మునిగిపోయాడు. ఆయన తీరు టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా ఉండటంతో ఉద్రిక్తలకు దారితీస్తుందని భావించిన పోలీసులు వెంకటేశ్వరరావుని అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ నేత ఆకులు వెంకటేశ్వరరావు కోర్టు వద్ద స్వీట్లు పంచడానికి బలమైన కారణం ఉందని అంటున్నారు. గత కొంత కాలంగా చంద్రబాబు, లోకేష్ పై ఆకుల సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాను టీడీపీ కోసం ఎంతో పనిచేస్తే.. తనను లోకేష్ చంపడానికి ప్రయత్నిస్తున్నాడని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం తన ఆస్తులను పోగొట్టుకున్నానని.. జూబ్లీహిల్స్ లో 400 గజాలు ల్యాండ్ ని చంద్రబాబు నమ్మినబంటు కెఎల్ నారాయణ అన్యాయంగా లాక్కున్నాడని.. ఈ విషయం చంద్రబాబు కి తెలిసి కూడా పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ పార్టీ గురించి నిర్లక్ష్యంగా మాట్లాడే అచ్చెన్నాయుడికి టీడీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ వల్ల ఎంతో మంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డుతున్నారు.
గతంలో చంద్రబాబు చేసిన అన్యాయానికి జైల్లో నెలరోజులు గడపాల్సి వచ్చింది.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడి వద్దకు వెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోయారు. టీడీపీలో తాను ఎదుగుతున్న సమయంలోనే తొక్కేశారని.. తన కుటుంబం ఇప్పుడు వీధిన పడిందని, చంద్రబాబును నమ్మి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి నుంచి చంద్రబాబుకు జనాలను వాడుకొని వదిలివేయడం బాగా తెలుసుఅని అన్నారు. టీడీపీ జాతీయ నాయకుడు అని చెప్పుకొని తిరిగే చంద్రబాబు తెలంగాణ లో పార్టీ గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. ఇప్పటికైనా టీడీపీ కార్యకర్తలు నిజం తెలుసుకోవాలని ఆకుల వెంకటేశ్వర్లు హితవు పలికారు.