ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు నువ్వానేనా అన్నట్లుగా పోటాపోటీగా మాటలు రువ్వుకుంటున్నారు. తాజాగా పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై దాడిచేశారు. ఆయన కారుపై వారు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే గన్ మెన్ కు గాయాలయాలు కాగా.. జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యేపై ఈ దాడి జరిగింది. తనపై దాడి ప్లాన్ ప్రకారమే జరిగిందని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పేర్కొన్నారు.
వినుకొండలో టీడీపీ-వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం కాగా.. గన్ మెన్ కు గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే దాడికి నిరసనగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు భారీగా అక్కడికి మోహరించారు. ఇరువర్గాలను చెదరగొట్టే క్రమంలో సీఐ గాల్లోకి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.
ఇక దాడి అనంతరం మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. ఆయన మాట్లాడుతూ..”టీడీపీ కార్యకర్తలు ప్లాన్ ప్రకారమే నాపై దాడికి దిగారు. నేన జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తుంటే అరగంట అడ్డుకుని మరీ రాళ్లతో దాడి చేశారు. రెండు రోజుల క్రితం నా డెయిరీ ఫామ్ ను ధ్వంసం చేశారు. ఇప్పుడు నాపై భౌతికంగా దాడి చేయాలని ప్లాన్ చేశారు. టీడీపీ కుట్రలను తిప్పికొడతాం, ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాం. గ్రామాల్లో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్ర చేస్తోంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు బ్రహ్మనాయుడు. ఇక తనపై దాడిచేసిన ఎవర్ని వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.