బుధవారం చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఐటం నంబర్ 61గా చంద్రబాబు పిటిషన్ లిస్ట్ లో ఉంచారు. చంద్రబాబు తరపున మరోసారి హరీష్ సాల్వే, సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ జస్టిస్ ఖన్నా బెంచ్ కి వెళ్లింది. ఇదే బెంచ్ లో జస్టిస్ ఎస్వీఎన్ భట్టి కూడా ఉన్నారు. అయితే ఆయన చంద్రబాబు పిటిషన్ పై ‘నాట్ బిఫోర్ మి’ అని భట్టి స్పందించారు. దీంతో చంద్రబాబు పిటిషన్ ను విచారణకు తిరష్కరిచిన ఆ జడ్జి ఎవరా? అని అందరిలో ఆసక్తికి నెలకొంది. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం నెటిజన్లు చేస్తున్నారు. మరి.. అసలు ఈ జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఎవరు, ఆయన చంద్రబాబు పిటిషన్ ను తన ముందుకు వద్దని తిరష్కరించడానికి గల కారణం ఏమిటి ?. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
ఎస్వీఎన్ భట్టి పూర్తి పేరు… సరస వెంకటనారాయణ భట్టి. ఈయన చిత్తూరు జిల్లాలోని మదనపల్లి జన్మించారు. బెంగుళూరులోని జగద్గురు రేణుకాచార్య కాలేజీలో లా పూర్తి చేశారు. అనంతరం 1987లో ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2013 ఏప్రిల్ 12 ఏపీ హైకోర్టు అదనపు న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాలకు పూర్తి స్థాయి హైకోర్టు న్యాయమూర్తిగా 2014 జూన్ నుంచి 2018 డిసెంబర్ వరకు పని చేశారు. ఇక కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు న్యాయమూర్తిగా 2019 జనవరి నుంచి 2019 మార్చి వరకు పని చేశారు. అనంతరం కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఈ ఏడాది జూలైలో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2027 మే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ముందుకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఆయితే ఆయన ఏపీకి చెందిన వ్యక్తి.. పిటిషన్ కూడా ఈ రాష్ట్రానికి చెందినది కావడంతో ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని జస్టిస్ భట్టి ప్రకటించారు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని జస్టిస్ ఖన్నా సూచించారు. ప్రస్తుతం బెంచ్ ముందు ఉన్న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ వచ్చే వారం విచారణకు స్వీకరిస్తామని జస్టిస్ ఖన్నా తెలిపారు.
తమ సహచరుడు ఎస్వీఎన్ భట్టి ఉండేందుకు సుముఖంగా లేరు కాబట్టి మరో జడ్డితో కలిసి ఈ కేసును విచారిస్తామని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలకు లోబడి ఈ ఆర్డర్ వర్తిస్తుందని జస్టిస్ ఖన్నా తెలిపారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు లాయర్లు సీజేఐ ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పిటిషన్ అక్టోబర్3 తేదీకి సీజేఐ వాయిదా వేశారు. ఇలా చంద్రబాబు కేసు సుప్రీం కోర్టులో అనేక మలుపు తిరిగి.. చివరకు మంగళవారానికి వాయిదా పడింది. ఇక ఎస్వీఎన్ భట్టి తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఎస్సీఎన్ భట్టి తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.