iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదు రోజులు భారీ వర్షాలు!

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. నిన్న తెలంగాణ, ఏపీల్లో భారీ వర్షాలు పడ్డాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలు నదులను తలపించాయి. తెల్లవారుజామునుంచి మొదలైన వర్షం.. 12.30 గంటల వరకు కొనసాగింది. ఇక, అప్పటినుంచి వర్షం పడ్డం ఆగిపోయింది. బుధవారం ఉదయం వర్షం మళ్లీ మొదలైంది. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలో 8వ తేదీ వరకు వర్షాలు పడతాయని ప్రకటించింది. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీనుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్‌లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, తూర్పుగోదావరి, పల్నాడు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరి, ఏపీ, తెలంగాణాల్లో వర్షాలు మళ్లీ దంచికొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.