చిత్తూరు జిల్లా, పుంగనూరులో జరిగిన ఘటన ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పోలీసులపై దాడులు, వారి వాహనాలను తగులబెట్టడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో పోలీసులను చంపాలనే కుట్ర, వెహికిల్స్‌ను తగులబెట్టడం, వ్యూహ ప్రతివ్యూహాలన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిసే జరిగాయా? ఈ విధ్వంసకాండతో సొంత పార్టీ కార్యకర్తలను కూడా బలిదానం చేయాలని ‘సార్’ నుంచి ఉత్వర్వులు అందాయా? పోలీసులు కేసు పెడితే న్యాయస్థానంలో కాపాడే విషయం కూడా ‘సార్’ చూసుకుంటారని పక్కాగా హామీ లభించిందా? ఇలాంటి చాలా ప్రశ్నలకు అవును అనే జవాబే వినిపిస్తోంది.
ఆగస్టు 4వ తేదీన పుంగనూరు దగ్గర జరిగిన విధ్వంసకాండలో పదుల సంఖ్యలో పోలీసుల మీద హత్యాయత్నం జరగడం, వాళ్ల వాహనాలను తగులబెట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు పరారీలో ఉన్నాడు. ఆయన డ్రైవర్ కలకడ నవీన్‌కుమార్ సహా మరో ఇద్దరు నిందితులు దోవల అమర్నాథ్, సి.పెద్దన్నలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. చల్లా బాబు డ్రైవర్ అయిన నవీన్‌కుమార్‌ను పోలీసులు విచారించగా.. ఈ కుట్రలకు సంబంధించిన పూర్తి ప్లాన్ విస్పష్టంగా చెప్పినట్లు సమాచారం. నేరాన్ని ఒప్పుకునే వాంగూల్మంలో నిందితుడు పలు విషయాలను పూస గుచ్చినట్లు చెప్పాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
పుంగనూరు విధ్వంసకాండ ఈ నెల 4వ తేదీన జరగ్గా.. ఈ కుట్రకు 1వ తేదీనే టీడీపీ పెద్దల నుంచి ఆదేశాల వచ్చినట్లు సమాచారం. ఆ రోజు పొద్దున చల్లా బాబు, ఆయన పీఏ గోవర్దన్ రెడ్డి, డ్రైవర్ నవీన్‌కుమార్ ముగ్గురూ కలసి రొంపిచెర్ల నుంచి పుంగనూరుకు కారులో బయలుదేరారట. కొంతదూరం వెళ్లగానే చల్లా బాబు మొబైల్లో మాట్లాడటం మొదలుపెట్టాడట. ‘సరే సార్, మీరు చెప్పినట్లే చేస్తా.. బీరు బాటిళ్లు, కర్రలు, రాళ్లు అన్నీ అక్కడే డంప్ చేస్తా. పోలీసులు మిమ్మల్ని టౌన్లోకి రానివ్వమని చెప్పగానే మనోళ్లు దాడి చేస్తారు. పోలీసులతో పాటు వైసీపీ వాళ్ల పైనా దాడి చేసి చంపైనా సరే మీరు చెప్పినట్లే కార్యక్రమం పెట్టిస్తా సార్’ అని మాట్లాడినట్లు సమాచారం.
మరుసటి రోజు టీడీపీలోని ముఖ్యమైన నాయకులతో రొంపిచెర్ల మండలం, బొమ్మయ్యగారి పల్లె పంచాయితీ, గర్నిమిట్టవారిపల్లెలోని చల్లా బాబు ఇంటి దగ్గర రహస్య సమావేశం నిర్వహించారట. తెలుగుదేశం పార్టీకి చెందిన హేమంత్‌రెడ్డి, మోహన్‌నాయుడు, నగేష్, రమేష్ రెడ్డి తదితరులు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారట. రాళ్లు, మద్యం బాటిళ్లతో పాటు టపాకాయ బాంబులు, కర్రలు ఎక్కడ డంప్ చేయాలో వారికి చల్లా బాబు వివరించాడట. పోలీసులు కాల్పులు మొదలుపెట్టగానే వారిని ఎలా రెచ్చగొట్టాలో కూడా ఆదేశాలు ఇచ్చాడట. ఒకరిద్దరు పోలీసుల ప్రాణాలు పోతే.. టీడీపీ కార్యకర్తలు చేసే బలిదానం వల్ల పార్టీ మైలేజ్ చాలా పెరుగుతుందని నమ్మబలికాడని సమాచారం.
వ్యూహం అమలులో భాగంగా విధ్వంసకాండ జరిగిన రోజు ఉదయం 10 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో చల్లా బాబు భేటీ అయ్యాడట. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారట. ఆ తర్వాత చల్లా బాబు తన పీఏ గోవర్దన్ రెడ్డి, డ్రైవర్ నవీన్‌కుమార్‌తో కలసి పుంగనూరుకు బయల్దేరాడట. అంతా అనుకున్నట్లే జరగాలని పీఏను చల్లా ఆదేశిచాడని తెలిసింది. అయితే ఇదే జరిగితే పోలీసులు తమపై కేసులు పెడతారని గోవర్దన్ రెడ్డి, చల్లా బాబును ప్రశ్నించాడని సమాచారం. కేసులను కోర్టులో మన ‘సార్’ చూసుకుంటాడని బాబు భరోసా ఇచ్చాడట. అలా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. పోలీసుల పైకి వారిని ఉసిగొల్పారని తెలుస్తోంది.