iDreamPost
android-app
ios-app

ఖాకీ అంటే కర్కశత్వం మాత్రమే కాదు! గుండెలను పిండేసే ఓ కథ!

ఖాకీ అంటే కర్కశత్వం మాత్రమే కాదు! గుండెలను పిండేసే ఓ కథ!

ప్రజా రక్షణ కోసం అనునిత్యం కష్టపడే వ్యవస్థల్లో పోలీస్ వ్యవస్థ ముందు వరుసలో ఉంటుంది. ఎండ, వాన, చలి వంటి ఇబ్బందులను దాటుకుని, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రజలకి అండగా నిలవడం వారికే చెల్లుతుంది.కానీ.., ఖాకీలల్లో కర్కశంగా ప్రవర్తించే కొందరి కారణంగా అప్పుడప్పుడు వీరి వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతూ ఉంటుంది. కానీ.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు.. ఆ ఖాకీ డ్రెస్ వెనుక కూడా ఓ సున్నితమైన మనసు ఉంటుంది. కష్టంలో ఉన్న వారికి సాయం అందించే ఔదార్యం ఉంటుంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా జరగగా.. తాజాగా శ్రీ సత్య సాయి జిల్లా పోలీసులు ఓ గొప్ప పని చేసి అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని నల్లమాడ గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, సూర్యనారాయణ దంపతులు నిరుపేద కూలీలు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. వీరికి 8 సంవత్సరాల వయసు ఉన్న స్రవంతి అనే కూతురు ఉంది. ఇక.. 3 సంవత్సరాల కిందట సూర్యనారాయణ ప్రమాదానికి గురి కావడంతో.. వెన్నెముక పని చేయక మంచానికి పరిమితం అయ్యాడు. అక్కడ నుండి లక్ష్మీ ఇంటి బాధ్యతలను తనపై వేసుకుంది. కూలీగా పనులు  చేస్తూ.. వచ్చిన సంపాదనతోనే కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. ఇలాంటి స్థితిలో కూడా విధి వీరిని వెక్కిరించింది. కుటుంబాన్ని నడిపిస్తున్న లక్ష్మీ కూడా 6 నెలల క్రితం అనారోగ్యంతో కన్నుమూసింది. అమ్మలేదు, నాన్న మంచంపై నుండి కదలలేడు. దీంతో.. 8 ఏళ్ళ చిన్నారి స్రవంతిని కష్టాలు చుట్టుముట్టాయి. చేతిలో సంపాదన లేదు. తండ్రిని వీడి బయటకి పోవడానికి ఆస్కారం లేదు. ఇక చదువు, ఆట వంటి వాటికి ఆ చిన్నారి ఎప్పుడో దూరం అయ్యింది. ఆకలితో యుద్ధం చేస్తున్న ఆ తండ్రి, కూతురు పరిస్థితి ఆనోటా, ఈనోటా చేరి.. చివరికి ఆ జిల్లా పోలీస్ అధికారులకి తెలిసింది.

స్రవంతి కుటుంబ దుస్థితిని తెలుసుకున్న  శ్రీ సత్య సాయి జిల్లా  ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి మానవత్వంతో  చలంచిపోయారు. వారికి అండగా నిలుస్తూ.. ఆ కుటుంబానికి వెంటనే ఆర్థిక సాయం చేశారు. చిన్నారి స్రవంతి పేరున రూ.30,000 బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వీటితో పాటు.. ఆ కుటుంబానికి కావాల్సిన దుస్తులు, నిత్యావసరాలు ఏర్పాటు చేయాలని నల్లమాడ పోలీసులకు సూచించారు. ఇక చిన్నారి స్రవంతిని నల్లమాడలోని రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి బాలికకు అవసరం అయిన బట్టలు పుస్తకాలు అందజేసి.. ఆమె చదువుకి అన్నీ ఏర్పాట్లు చేశారు. అలాగే.. ఆ చిన్నారికి అన్నీ వేళలా అందుబాటులో ఉంటూ.. ఆమెకి అండగా ఉండాలని నల్లమాడ పోలీసులకు  ఎస్పీ శ్రీ ఎస్వి మాధవరెడ్డి సూచించారు. ఎస్పీ చూపిన ఔదార్యంతో.. ఆ చిన్నారి కష్టాలు కొంతవరకు తీరాయి. కానీ.., చిన్నారి స్రవంతి, ఆమె తండ్రి సూర్యనారాయణ మామూలు జీవితాన్ని గడపాలంటే వారికి ఇంకా ఆర్థిక సాయం అవసరం. ఈ నేపథ్యంలోనే దాతల కోసం వారు ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. బాలిక కుటుంబానికి సాయం చేసిన ఎస్పీ. శ్రీ. ఎస్వి మాధవరెడ్డిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక.. చిన్నారి స్రవంతికి  సాయం అందజేయాలి అనుకున్నవారు ఈ క్రింది వివరాలకు మీకు తోచిన సహాయం చేయగలరు.

anantapur balika 2