Venkateswarlu
Venkateswarlu
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సీమెన్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు 240 కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఏపీ సీఐడీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారులు విజయవాడ తరలించారు. మరి కొద్దిసేపట్లో ఆయన్ని విజయవాడ మూడవ అదనపు జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ పవన్ కల్యాణ్ మాట్లాడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చంద్రబాబుకు ఐటీ నోటీసులపై నోరు మెదపని పవన్!
సీమెన్స్ స్కాంకు సంబంధించి కొద్దిరోజుల క్రితమే చంద్రబాబు నాయుడికి నోటీసులు వెళ్లాయి. 2016-2018 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా 118 కోట్లు లంచం తీసుకున్నారన్న అభియోగాలతో ఐటీ శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై చంద్రబాబుకు అత్యంత ఆప్తుడైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించలేదు. ప్రతీ విషయంలో చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడే పవన్ ఈ నోటీసుల విషయంలో నోరు మెదపలేదు. పవన్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
అప్పుడు తెరవని నోరు ఇప్పుడెందుకు తెరిచారు!
చంద్రబాబుకు ఐటీ నోటీసులు వెళ్లిన సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. అప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న పవన్.. చంద్రబాబును అరెస్ట్ చేయటంతో రంగంలోకి దిగారు. సీమెన్స్ స్కాంలో ఏ1గా ఉన్న బాబుకు మద్దతుగా మాట్లాడారు. శనివారం ఈ మేరకు ఓ వీడియో ప్రకటనను విడుదల చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. అయితే, ఐటీ నోటీసుల సమయంలో ఏమాత్రం నోరు మెదపని పవన్.. బాబును అరెస్ట్ చేయడంపై మాట్లాడ్డం చర్చనీయాంశంగా మారింది. స్కాంలో ఏ1గా ఉన్న చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడ్డం తీవ్ర దుమారం రేపుతోంది. పవన్ తన ముసుగు తీసేశారంటూ జనం గుసగుసలాడుకుంటున్నారు. మరి, చంద్రబాబుకు నోటీసుల సమయంలో మాట్లాడని పవన్.. అరెస్ట్ నేపథ్యంలో మాట్లాడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.