Dharani
ఈ ఏడాది కూరగాయల ధరలు సామాన్యుల చేత కన్నీరు పెట్టుస్తున్నాయి. మొన్నటి వరకు టమాటా ధర షాక్ ఇవ్వగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి ఉల్లి చేరింది. ఆ వివరాలు..
ఈ ఏడాది కూరగాయల ధరలు సామాన్యుల చేత కన్నీరు పెట్టుస్తున్నాయి. మొన్నటి వరకు టమాటా ధర షాక్ ఇవ్వగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి ఉల్లి చేరింది. ఆ వివరాలు..
Dharani
సామాన్యంగా ఇంధనం, గ్యాస్ ధరలు భారీగా పెరగడం వల్ల ప్రతి ఏటా జనాలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. కానీ ఈసారి మాత్రం.. కూరగాయల ధరలు కూడా జనాల చేత కన్నీరు పెట్టిస్తున్నాయి. మొన్నటి వరకు టమాటా ధర చూసి భయపడే పరిస్థితులు. ఒకానొక సందర్భంలో టమాటా ధర కిలో మీద 250 రూపాయల వరకు చేరింది. సుమారు నెలన్నర పాటు భారీ ధర కొనసాగింది. అయితే పెరిగిన టమాటా ధర వల్ల సామాన్యులు ఇబ్బంది పడితే.. రైతులు మాత్రం భారీగా లాభపడ్డారు. ఇక నిన్నటి వరకు టమాటా భయపెడితే.. ఇప్పుడు ఆ జాబితాలో ఉల్లి చేరింది. వారం రోజుల వ్యవధిలోనే ఉల్లి ధర భారీగా పెరిగింది. దాంతో మరోసారి కామన్ మ్యాన్ జేబుకు చిల్లుపడే పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధర భారీగా పెరిగింది. ఏపీలో కిలో ఉత్లి ధర 45-60 రూపాయలు పలుకుతుండగా.. హైదరాబాద్ ఒపెన్ మార్కెట్‌లో అయితే ఏకంగా కిలో ఉల్లి ధర 60-70 రూపాయలకు విక్రయిస్తున్నారు. దాంతో కోయకుండానే ఉల్లి సామాన్యుల చేత కన్నీరు పెట్టిస్తుంది. ఇక నవంబర్ మొదటి వారం వరకు ఉల్లి ధరలు ఇలానే ఉంటాయి అంటున్నారు మార్కెట్ నిపుణులు.
దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ ఈ సారి భారీ వర్షాలు కురిశాయి. దాంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడం వల్ల.. తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కారణంగా ఉల్లి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక మహారాష్ట్ర, కర్ణాటలో జోరు వానలుండగా.. తెలుగు రాష్ట్రాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సరిగా లేక కర్నూలు, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, చేవెళ్లలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో నిత్యం నగరానికి రావాల్సిన 80 నుంచి 100 లారీల ఉల్లి పంటలో.. ప్రస్తుతం కేవలం 20 శాతం మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. గత పదిహేను రోజులుగా, ఉల్లిపాయల రాకపోకలు దాదాపు 40 శాతం తగ్గాయని అంటున్నారు. అందువల్లే ధర భారీగా పెరిగిందని.. నవంబరు రెండో వారంలో స్థానికంగా ఖరీఫ్ పంట అందుబాటులోకి రానుండటంతో ధరలు తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.