ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్ ప్రత్యేక దృష్టి సారించింది.అందుకు రాష్ట్రంలో స్టేట్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్సఫార్మేషన్ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ నేతృత్వంలో గల ప్రతినిధుల బృందం మంగళవారం ఏపీ రాష్ట్ర సచివాలయానికి వచ్చింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.ఎస్.జవహర్ రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఆ బృందం చర్చించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి వివిధ రంగాల్లో అభివృద్ధి వ్యూహాల రచన, అధిక వృద్ధి రేటు సాధనకు గల అవకాశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో చర్చించింది.
ఇంకా ఈ సమావేశంలో అర్బనైజేషన్, ఇండస్ట్రీ పరస్పెక్టివ్స్ లో డెవలప్పింగ్ సిటీ రీజియెన్ కాన్సెప్ట్ విధానంపై చర్చించింది. ఈసందర్భంగా నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి వి.రాధ మాట్లాడుతూ రాష్ట్రం అధిక వృద్ధి రేటు సాధనకై అభివృద్ధి వ్యూహాల రూపకల్పనకు గాను రానున్న రెండేళ్ళలో 5.28 కోట్లు నీతి ఆయోగ్ అందించనుందని తెలిపారు. అదే విధంగా రాష్ట్రం అధిక వృద్ధి రేటు సాధనలో నీతి ఆయోగ్ ఆర్ధికపరమైన, నాలెడ్జిపరమైన సహకారం అందిస్తుందని అన్నారు.
ఈ సమావేశంలో స్టేట్ సీఎస్ డా.కే.ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. నగరీకరణ మరియు పారిశ్రామికీకరణ అంశాల్లో దేశంలో 4నగరాలను ఎంపిక చేస్తే వాటిలో విశాఖపట్నం నగరం ఉండడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఏపీ విశాలమైన సముద్ర తీరాన్నికలిగి ఉందని, వ్యవసాయంతో పాటు ఆహాశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు పోర్టు ఆధారిత అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్టు తెలిపారు. విద్యా,వైద్య పరంగా పెద్దఎత్తున మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని చెప్పారు.
అదే విధంగా నవరత్నాలు పేరిట పెద్ద ఎత్తున పలు సంక్షేమ పధకాలను అమలు చేయడం వల్ల రానున్న రోజుల్లో అధికవృద్ధి రేటు సాధనకు అన్నివిధాలా అవకాశం కలుగుతుందని సీఎస్ పేర్కొన్నారు. యువతలో మరింత నైపుణ్య శిక్షణ విషయంలో నీతి ఆయోగ్ తగిన దృష్టి సారించాలని సిఎస్ జవహర్ రెడ్డి సూచించారు. ఈసమావేశంలో వివిధశాఖలకు చెందిన ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. అలానే నీతి ఆయోగ్ కన్సల్టెంట్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. మరి.. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఇనార్బిట్ మాల్‌తో 8 వేల మందికి ఉపాధి.. విశాఖ రూపురేఖలు మారిపోతాయి: సీఎం జగన్