Krishna Kowshik
ఒకాగానొక్క కొడుకు. ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు పిల్లాడు.. కానీ
ఒకాగానొక్క కొడుకు. ఎంతో గారాబంగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు. వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు పిల్లాడు.. కానీ
Krishna Kowshik
డాక్టర్‌ను దేవుడిగా పూజించే దేశంలో కొందరు వైద్యులు.. ఆ వృత్తికి మాయని మచ్చగా మారిపోతున్నారు. దేవాలయాలైన ఆసుపత్రుల్లో అనారోగ్య సమస్యలు, ఆపదలో వచ్చిన వారికి సకాలంలో వైద్యం అందించి, తిరిగి పునర్జన్మ పోసి.. ఎంతో మందితో చేతులెత్తి మొక్కించుకున్నారు. కానీ ఇటీవల కాసుల కక్కుర్తిలో వైద్యం సరిగా అందించడం లేదు. పేషెంట్‌ను ఓ మనీ పర్సుగా భావిస్తున్నారు తప్ప..రోగుల బాధను అర్థం చేసుకోవడం లేదు. ఆసుపత్రికి రావడం ఆలస్యం ఆ టెస్టులు, ఈ టెస్టులు అంటూ కాలక్షేపం చేయడం, అత్యవసర పరిస్థితిలో వచ్చిన పేషెంట్లను కనీసం నాడి కూడా చెక్ చేయకుండా ఐసీయులో పడేసి.. ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.. తూతూ మంత్రంగా చెక్ చేస్తున్నారు. తాజాగా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది.
ఓ తల్లికి కడుపుకోత అంటూ పెద్ద బ్యానర్స్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో దర్శనమిచ్చాయి. వైద్యులు నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి మృతి చెందగా.. తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. డాక్టర్ల నిర్వాకాన్ని ఎండగడుతూ, అమ్మ కడుపు కోత అర్థం అయ్యేలా జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ బాలుడు తల్లిదండ్రులు. ఇంతకు ఏం జరిగిందంటే.. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం, రావివలస పంచాయతీ, చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన మురళి, నిరోషా దంపతులు. వీరికి సాయి వినీత్(12) అనే కుమారుడు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో ఈ నెల మే 21న తోటి పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నాడు సాయి వినీత్. ఈ నేపథ్యంలో క్రికెట్ బాల్ పక్కనే ఉన్న పొదల్లో పడింది. ఆ బాల్‌ను తెచ్చేందుకు అక్కడకు వెళ్లాడు వినీత్. ఈ క్రమంలో ఏదో కరిచినట్లు అనిపించింది. బాల్ తీసుకువచ్చిన కాసేపటికే సాయి వినీత్ స్పృహ తప్పి పడిపోయాడు.
వెంటనే అతడ్ని కుటుంబ సభ్యులు టెక్కలిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు ఏం జరిగిందో చూడకుండా.. ముల్లు గుచ్చుకుని ఉంటుందని భావించి.. వైద్యం అందించలేదు. ముల్లు గుచ్చుకుంటే.. స్పృహ కోల్పోరన్న కనీస ఆలోచన కూడా చేయకుండా ఎలాంటి వైద్యం ఇవ్వకుండా రెండు గంటల పాటు గడిపేశారు. దీంతో బాలుడి పరిస్థితి విషమించింది. దీంతో చేతులెత్తేశారు వైద్యులు. వెంటనే రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. నరసన్నపేట చేరుకునే సరికి బాలుడి పరిస్థితి మరింత విషమించింది. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా సాయివినీత్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేని బాలుడి తల్లి మే 22న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది.
గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ తమకు జరిగిన అన్యాయం.. మరొకరికి జరగకూడదన్న ఉద్దేశంతో.. డాక్టర్ల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలతో నిరసన చేపట్టారు తల్లిదండ్రులు. అందులో ‘మే 21వ తేదీన టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణం, నిండు ప్రాణాన్ని బలితీసుకుని, ఓ తల్లికి 12 ఏళ్ల కుమారుడిని దూరం చేసి కడుపుకోత మిగిల్చిన మీకు, నా కొడుకుతో పాటు శ్రద్ధాంజలి. అయ్యా, వైద్య శాఖ కమీసర్ గారు, సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకు వచ్చినా, రెండు గంటల పాటు సమయాన్ని వృధా చేసి పరిస్థితి విషమించాక, బలగ ఆసుపత్రికి రిఫర్ చేయగా.. మార్గమధ్యంలో మా కొడుకు మరణానికి కారణమైన వైద్య సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో, మీ విన్నపానికే విడిచిపెడుతున్నాం. పాము కాటుకి, ముల్లు గుచ్చుకోవడానికి తేడా తెలియని మీ సిబ్బందికి శతకోటి వందనాలు’అంటూ ఫ్లెక్సీలో నిరసన వ్యక్తం చేశారు బాలుడు తల్లిదండ్రులు దాసరి మురళి, నిరోష. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.