iDreamPost
android-app
ios-app

నల్లమల వాగులో కొట్టుకొస్తున్న వజ్రాలు.. తరలి వస్తోన్న జనాలు!

  • Published Aug 02, 2023 | 10:31 AM Updated Updated Aug 02, 2023 | 10:31 AM
  • Published Aug 02, 2023 | 10:31 AMUpdated Aug 02, 2023 | 10:31 AM
నల్లమల వాగులో కొట్టుకొస్తున్న వజ్రాలు.. తరలి వస్తోన్న జనాలు!

సాధారణంగా వర్షాకాలం ప్రారంభం కాగానే.. రాయలసీమ జిల్లాల్లో మరీ ముఖ్యంగా కర్నూలు, అనంతపురం ప్రాంతాల ప్రజలు వజ్రాల వేటకు వెళ్తారు. ప్రతి ఏటా కొందరికయినా సరే వజ్రాలు దొరికి లక్షాధికారులు అవుతారు. ఒక్క వజ్రం దొరికితే చాలు జీవితాలే మారిపోతాయి. అందుకే చాలా మంది ఎంతో ఆశ, నమ్మకంతో వజ్రాల వేట సాగిస్తారు. అయితే ఎవరో కొందరిని మాత్రమే అదృష్టం వరిస్తుంది. వజ్రాల వేట అనగానే మనకు కర్నూలు, అనంతపురం జిల్లాలు గుర్తుకు వస్తాయి. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా నల్లమల అటవీ ప్రాంతంలో కూడా వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. వాగులో వజ్రాల కోసం.. ఎంతో దీక్షగా.. గంటల తరబడి వెతుకుతున్నారు జనాలు. ఆ వివరాలు..

నంద్యాల-గిద్దలూరు రహదారికి సమీపంలోని గాజులపల్లి గ్రామానికి దగ్గర్ల సర్వనరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ గుడికి కొద్ది దూరంలో వాగు ప్రవహిస్తుంది. అయితే వానాకాలంలో ఈ వాగులో వజ్రాలు దొరుకుతాయని స్థానికులు, చుట్టుపక్కల వారి నమ్ముతారు. దాంతో దానికి వజ్రాల వాగు అని పేరు వచ్చింది. ప్రతి ఏడాది వర్షాలు కురిసి, వాగులో నీటి ప్రవాహం మొదలుకాగానే.. ఇక్కడ వజ్రాల వేట మొదలవుతుంది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వ్రజాల వెతకడం కోసం ఇక్కడకు వస్తారు.

కొన్ని రోజుల కిందట ఈ వాగులో ఒక వ్యక్తికి ఓ వజ్రం దొరికినట్లు తెలిసింది. మార్కెట్‌లో ఈ వజ్రం 4 లక్షల రూపాయలు పలికినట్లు తెలిసింది. ఈ విషయం కాస్త స్థానికంగా వైరల్‌గా మారడంతో.. జనాలు వాగు వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో వజ్రాల వాగులో డైమండ్స్‌ వేటకు వచ్చే వారి సంఖ్య ఈ ఏడాది మరింత పెరిగింది అంటున్నారు స్థానికులు. కుబంబాలకు కుటుంబాలు తరలివచ్చి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో మహిళలు, పిల్లలు, యువకులు ఇలా అన్ని వయసుల వారు ఈ వాగు వద్దకు వచ్చి వజ్రాల కోసం వెతుకుతూ తమ అదృష్టాన్ని పరిక్షీంచుకుంటున్నారు.

నంద్యాల జిల్లాతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి, విజయవాడ నుంచి ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. వజ్రాలు కాకపోయినా ఉంగరాల్లో పొదిగే రంగు రాళ్లు, ఆకర్షణీయమైన రంగుల్లో వివిధ ఆకృతుల రాళ్లు దొరుకుతున్నాయి. నాణ్యతను బట్టి మార్కెట్‌లో అవి రూ. 5 వేల నుండి రూ. 10 వేల వరకు పలుకుతున్నాయట.