Arjun Suravaram
Arjun Suravaram
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన సంగతి తెలిసిందే. గత నెల రోజుల నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు జైలుకు వచ్చిన తరువాత కేజీ బరువు పెరిగారంటూ జైళ్ల శాఖ డీఐడీనే స్వయంగా వెల్లడించారు. దీంతో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నేతల దొంగ నాటకాలు బయటపడ్డాయని వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యుల నుంచి చంద్రబాబుకు హాని ఉండొచ్చంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
శనివారం పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ మెగా శిబిరాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పరిపాలనపై, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అలానే చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని మంత్రి చెప్పారు. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో జరిగినట్టే జరిగే అవకాశం లేకపోలేదని మంత్రి అనుమానాలు వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ మూవీలో ఒక మాజీ సీఎం, ఆయన కుమారుడు మధ్య జరిగే ఓ సీన్ ను ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ గుర్తు చేశారు. మాజీ సీఎం పాత్రధారిని కొడుకే చంపేయడం ద్వారా ఆ సానుభూతితో తాను సీఎం కావాలనే ప్రయత్నం చేస్తాడు. అచ్చం అలాగే.. ప్రస్తుతం చంద్రబాబును ఆయన కుటుంబీకులే కుట్ర చేసి అంతం చేస్తారనే భయం తనకు ఉందంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు భువనేశ్వరి.. తన కన్న తండ్రి ఎన్టీఆర్ కు తన భర్త చంద్రబాబు వెన్నుపోటు పొడిచి, ఆయన చావుకు కారణమైనా కూడా స్పందించలేదని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబునాయుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, అయినా ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, 5 కేజీల బరువు తగ్గిపోయారని భువనేశ్వరి ప్రకటించడం, అలాగే లోకేశ్ తన తండ్రికి జైలులో ప్రాణహాని ఉందంటూ ప్రకటించడం చూస్తుంటే.. తనకు ఈ అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి వివరించారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే లోకేశ్, భువనేశ్వరి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. ప్రస్తుతం మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. మరి.. మంత్రి కొట్టు సత్యనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.