iDreamPost
android-app
ios-app

MLA ఆర్కే గొప్ప మనసు.. ఆపత్‌ కాలంలో గర్భిణికి సాయం!

MLA ఆర్కే గొప్ప మనసు.. ఆపత్‌ కాలంలో గర్భిణికి సాయం!

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కళ్ల ముందు ఆటో బోల్తా పడగా.. వారిని బయటకు తీయటానికి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. వారిని బయటకు తీయటమే కాదు.. నిండు గర్బిణిని తన కాన్వాయ్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గురువారం ఉదయం దుగ్గిరాల మండలంలో చోటుచేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన కాన్వాయ్‌లో దుగ్గిరాల మండలం, రేవేంద్రపాడు వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వాహనం పెదవడ్డపూడి రైల్వే గేటు వద్దకు వచ్చింది.

అక్కడ ఓ ఆటో మలుపు తిరుగుతూ సైడ్‌కు వాలి బోల్తా పడింది. ఇదంతా ఎమ్మెల్యే ఆర్కే కళ్లముందే జరిగింది. దీంతో ఆయన వెంటనే తన కాన్వాయ్‌ని ఆపించారు. తర్వాత తన సిబ్బందిని ప్రమాదానికి గురైన వారికి సాయం చేయమని పంపారు. అంతటితో ఆగకుండా ఆయన కూడా రంగంలోకి దిగారు. అందులో ఉన్న మహిళలను సిబ్బంది, ఇతర జనంతో కలిసి బయటకు తీసుకువచ్చారు. ఆ వెంటనే వారిని వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదానికి గురైన వారిలో నెలలు నిండిన లావణ్య అనే గర్భిణి కూడా ఉంది.

ఆస్పత్రికి వెల్లటం ఆలస్యం అయితే, ఆమెతో పాటు కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆర్కే భావించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కాన్వాయ్‌లో తెనాలి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆర్కే చేసిన మంచి పనికి సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎమ్మెల్యే ఆర్కే ఇలా రోడ్డుపై ప్రమాదానికి గురైన వారికి సాయం చేయటం ఇదేం కొత్తేమీ కాదు.. గతంలో చాలా సార్లు ఆయన సాయం చేశారు. మరి, ఆపత్‌ కాలంలో గర్భిణికి సాయం చేసిన ఎమ్మెల్యే ఆర్కే మంచి తనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.