మైదానంలో చిరుతలా దూసుకుపోవడం అతడికి వెన్నెతో పెట్టిన విద్య. ఇక ప్రత్యర్థులను తన ఆటతో ముప్పుతిప్పలు పెట్టడంలో అతడు దిట్ట. కటిక పేదరికం వెక్కిరిస్తున్నా.. కన్న తల్లికోసం తన కలల వెంట పయనించి ఉన్నత స్థాయికి ఎదిగాడు. జాతీయ స్థాయిలో తన సత్తా ఏంటో తెలిసేలా చేశాడు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణకు కూడా ఎంపికైయ్యాడు. కానీ అతడి అప్రతిహత ప్రస్థానం చూసి విధికి సైతం కన్నుకుట్టినట్లు ఉంది. దాంతో అతడిని అనారోగ్యం రూపంలో కబళించింది. బాపట్ల హ్యాండ్ బాల్ వీరుడు హర్షవర్ధన్ మరణంతో క్రీడాలోకం గుండె ఆగినంతపనైంది.
ఆవుల హర్షవర్ధన్ రెడ్డి (23) కోటపాడు గ్రామానికి చెందిన యువకుడు. కటిక పేదరికంలో పుట్టినప్పటికీ తన ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. హ్యాండ్ బాల్ ఆటలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. రెండు సార్లు ఆంధ్రా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. తన అపారమైన ప్రతిభతో అంతర్జాతీయ శిక్షణకు కూడా ఎంపికైయ్యాడు. ఇక తొందర్లోనే భారత జట్టుకు ఆడాలన్న తన కల నెరవేరబోతుంది అనుకున్న టైమ్ లోనే హర్షవర్ధన్ ను మృత్యువు కబళించింది. ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు హర్షవర్ధన్.
ఈ క్రమంలోనే 15 రోజుల క్రితం ఐదో సెమిస్టర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే తీవ్ర అనారోగ్యానికి గురైయ్యాడు హర్షవర్ధన్. దాంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చూపించింద తల్లి. కానీ పరిస్థితి సీరియస్ గా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో హర్షవర్ధన్ మరణించాడు. అయితే అతడి మరణానికి సరైన కారణాలేవీ తెలియరాలేదు.
కానీ మూడు నెలల క్రితం హర్షవర్ధన్ ను కుక్క కరిచిందని, అతడు ఇంజక్షన్ తీసుకుని కాలేజ్ కు వెళ్లాడని, తర్వాత దానికి ఎలాంటి చికిత్స తీసుకోలేదని తెలుస్తోంది. దీనివల్ల రేబిస్ వ్యాధితో చనిపోయి ఉంటాడని వైద్యులు చెబుతున్నారు. కాగా.. ఐదు సంవత్సరాల క్రితం తండ్రి చనిపోగా.. తల్లి శ్రీదేవి కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివిస్తోంది. తన ప్రతిభతో పేదరికాన్ని జయించాడు కానీ విధిని మాత్రం జయించలేకపోయాడు హర్షవర్ధన్. ఒక్కగానొక కొడుకు విగతజీవిగా పడిఉండటం చూసిన ఆ తల్లి గుండెలు పగిలేలా విలపించింది. ఈ దృశ్యాలు చూసేవారిని సైతం కంటతడి పెట్టించాయి.
ఇదికూడా చదవండి: విశాఖలో కారు బీభత్సం.. మద్యం మత్తులో అతి వేగంతో డ్రైవ్ చేసిన మహిళ