iDreamPost
android-app
ios-app

ఏపీలో మరో కొత్త పథకం! వారి అకౌంట్ లోకి లక్ష రూపాయలు!

ఏపీలో మరో కొత్త పథకం! వారి అకౌంట్ లోకి లక్ష రూపాయలు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయ్యింది. ఈ మీటింగ్ లో మంత్రివర్గం కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులపై వరాల జల్లులు కురిపించింది. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ అంశంతో పాటు దాదాపు 49 అంశాలపై ఏపీ మంత్రి మండలి చర్చించింది. వాటిలో ప్రధాన అంశాలపై సుదీర్ఘ సమయం చర్చించారు. ఈ క్రమంలోనే సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారి విషయంలో కూడా ఏపీ మంత్రి మండలి కీలక నిర్ణయం తీసుకుంది.

‘జగనన్న సివిల్స్ సర్వీసెస్ ప్రోత్సాహకం’ పేరుతో మరో పథకం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ ప్రభుత్వం యువత కోసం, విద్యార్థుల కోసం ఇప్పటికే అనేక రకాల పథకాలను ప్రవేశ పెట్టిన విషయం అందరికి తెలిసిందే. అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్య వంటి ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు. ఈ పథకాల ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించారు. అంతేకాక పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలని ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా సివిల్స్ సర్వీసెస్ కి సిద్ధమయ్యే వారికి విషయంలో కూడా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పథకం వర్తించేలా కేబినేట్ నిర్ణయం తీసుకుంది. సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ప్రిలిమినరీ క్యాలిఫై అయితే రూ.లక్ష ప్రోత్సాహకం, మెయిన్స్ క్యాలిఫై అయితే రూ.1.5 లక్షల ప్రోత్సాహకం ఇచ్చేలా మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ అంశంతో పాటు మరికొన్ని కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి.. ఏపీ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.