Krishna Kowshik
Krishna Kowshik
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలు బిల్లులకు ఆమోదం లభించింది. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన రెగ్యులరైజేషన్ బిల్లును శాసన సభ ఆమోదించింది. దీంతో కాంట్రాక్టు ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా శుభవార్త చెప్పింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్ విధానం రద్దు చేస్తూ దాని స్థానంలో జీపీఎస్ విధానం తీసుకు రాగా.. దాని చట్టబద్దత చేసేందుకు జీపీఎస్ బిల్లును ప్రవేశపెట్టింది. జీపీఎస్ బిల్లును గతంలో కేబినేట్ ఆమోదించినప్పటికీ.. ఇప్పుడు కొన్ని మార్పులు చేస్తూ ఈ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఉద్యోగులంతా ప్రభుత్వంలో ముఖ్యమైన భాగమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారని, వారి వయస్సును 60 నుండి 62కు పెంచామని తెలిపారు. 2014 నాటి నుండి ఉద్యోగం చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నామన్నారు. ఈ విలీనంతో దాదాపు 53 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అలాగే జీపీఎస్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో..ప్రభుత్వంపై రూ. 2500 కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు. ఆశావర్కర్లకు గతంలో రూ. 3వేలు ఇచ్చేవారని, కానీ తమ హయాంలో రూ. 10 వేలకు పెంచామన్నారు. 108 అంబులెన్స్ జీతం కూడా పెంచామని, పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని అన్నారు.