iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Published Aug 18, 2023 | 8:51 AM Updated Updated Aug 18, 2023 | 8:51 AM
  • Published Aug 18, 2023 | 8:51 AMUpdated Aug 18, 2023 | 8:51 AM
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్‌.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలో పెద్దగా వానలు కురవలేదు. కానీ జూలై నెల చివర్లో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తాయి. ఇక ఇదే పంథా కొనసాగుతుందని ఆశిస్తే.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఆగస్టులో కొన్ని రోజుల పాటు తేలికపాటి వర్షాలు తప్ప.. ఎక్కడా భారీ వర్షాలు నమోదైన దాఖలాలు లేవు. గత పది రోజులుగా వర్షాలు లేక రైతులు ఆందోళన పడుతున్నారు. ఈ నెలలో లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ రెండు వారాల్లోనైనా జోరు వానలు కురుస్తాయనే ఆశలో ఉన్నారు అన్నదాతలు. ఈ క్రమంలో వానలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల​కు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆ వివరాలు..

వాతావరణ శాఖ.. తెలంగాణకు వర్ష సూచన చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఆవర్తనం అల్పపీడనంగా మారి.. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురువనున్నాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

కరీంనగర్‌, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్‌-భూపాలపల్లి, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, కుమ్రం భీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ సూచించింది. ఈ రెండు రోజుల్లో అనగా.. శుక్ర, శనివారాల్లో ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది

ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..

తెలంగాణతో పాటు.. ఏపీలోని కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయంటున్నారు.

మరోవైపు ఈ అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు శుక్రవారం నుంచి ఈ నెల 21వరకు వరకు ఏపీ తీరం వెంబడి చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది.