Dharani
IMD Alert-AP, Telangana 3 More Days Heavy Rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు..
IMD Alert-AP, Telangana 3 More Days Heavy Rains: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ తెలిపింది. ఆ వివరాలు..
Dharani
గత నాలుగైదు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాక రానున్న మూడు రోజులు ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు వల్ల ఏపీ, తెలంగాణలో జూన్ నెల ప్రారంభం నుంచే వర్షాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో మరో మూడ్రోజుల పాటు అటు తెలంగాణ, ఇటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అధికారులు, జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో మరో మూడు రోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని.. ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని జిల్లాల్లో ముసురు కొనసాగుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
నేడు తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, హన్మకొండ, ములుగు, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడమే కాక ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్పపీడనం బలహీనపడిందని.. ఈ కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రాలో పలుచోట్ల, అలానే రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలానే ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
రానున్న మూడు రోజుల పాటు ఈదురు గాలులు, ఉరములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని.. జనాలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలకు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం అయితేనే బయటకు వెళ్లాలని.. చెట్ల కిందకు అసలు వెళ్లరాదని సూచించారు.