iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాలకు ఐఎండి అలర్ట్..ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి!

  • Published Apr 15, 2024 | 9:50 AM Updated Updated Apr 15, 2024 | 9:50 AM

IMD Alert: మార్చి నెల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

IMD Alert: మార్చి నెల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఐఎండి అలర్ట్..ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి!

తెలుగు రాష్ట్రాల్లో గత నెల నుంచి ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటిపోయాయి. రాబోయే రోజుల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. వేడి గాలుల వల్ల ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎండ ప్రతాపం తట్టుకోలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పట్టపగలు రోడ్లన్నీ నిర్మాణుశ్యంగా మారిపోతున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు శీతలపానియాల వెంట పరుగులు పెడుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్ర ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సూర్యుడి ప్రతాపం రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఏపీలో ఆదివారం నుంచి ఉష్ణోగ్రత మరింత పెరిగిందని.. సోమవారం 140 మండలాల్లో, మంగళవారం 113 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లో మోస్తరు వేడిగాలులు వీస్తుండగా.. ఉత్తరాంధ్రలో తీవ్రంగా వీస్తున్నాయి. నంద్యాల జిల్లాలో 43.4, మన్యం జిల్లా నవగాం, విజయనగరం జిల్లా తుమ్మకపల్లిలో 43.3, శ్రీకాకుళం జిల్లా అముదాలవలస లో 42.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్ని మండలాల్లో వేడిగాలులు వీచే సూచన ఉందని విపత్తు నిర్వహణ SDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు వీలైంత వరకు 11 గంటల నుంచి 4 గంటల వరకు ఇంట్లో ఉండాలని.. తప్పని సరి పరిస్థితి అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం తో పోలిస్తే సోమ, మంగళ వారాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరగవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం ఏడు జిల్లాలో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్ కు పైగా నమోదు అయ్యింది. గరిష్టంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం, మహబూబాబాద్ జిల్లా మరిపెడ 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. హైదరాబాద్ లో కూడా ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిన్న 41 డిగ్రీల సెల్సీయస్ వరకు నమోదు అయ్యింది. రానున్న వారం రోజులు చాలా అలర్ట్ గా ఉండాలని.. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఐఎండీ హెచ్చరిస్తుంది. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. డీ హైడ్రేట్ కాకుండా లస్సీ, నిమ్మకాయ రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పుచ్చ పండు తింటే మంచిదని అంటున్నారు.