పూలసరి శంకరరావు ఓ మత్య్సకారుడు. అతడికి చేపలు పట్టి విక్రయించడమే జీవనాధారం. రోజూ మాదిరిగానే నదిలో చేపల వేటకు వెళ్లాడు. వలను నదిలో విసిరగా.. అతడి వలకు ఏదో బలమైన వస్తువు తగిలింది. పెద్ద చేప అనుకుని ఈరోజు తన పంట పండింది అనుకున్నాడు. అతి కష్టం మీద ఆ వలను పైకి లాగాడు. కానీ వలలో చేపలు లేవు. అందులో ఉన్న దేవుళ్ల విగ్రహాలను చూసి షాక్ అయ్యాడు శంకరరావు. లక్ష్మిదేవి, వినాయకుడు, ఆంజనేయ స్వామి విగ్రాలు వలలోకి వచ్చాయి. అయితే అతడికి ఏమి చేయాలో తోచక తిరిగి వాటిని నదిలోనే పడేశాడు. కానీ..
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో పురాతన దేవతల విగ్రహాలు బయటపడ్డాయి. భగీరథపురం గ్రామానికి చెందిన పూలసరి శంకరరావు అనే మత్స్యకారుడు హిరమండలం గొట్టాబ్యారేజీ దిగువున ఉన్న వంశధార నదిలోకి చేపల వేటకు వెళ్లాడు. చేపల కోసం వలను విసిరగా.. అతడికి చేపలకు బదులుగా లక్ష్మిదేవి, గణపతి దేవుడు, ఆంజనేయస్వామి విగ్రాలు దొరికాయి. దీంతో షాక్ గురైన శంకరరావు.. ఆ విగ్రహాలను ఏం చేయాలో తెలియక మళ్లీ నదిలోనే పడేశాడు. చేపల వేట పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లి.. అక్కడ జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పాడు.
దీంతో గ్రామస్థులు అంతా కలిసి ఆ విగ్రహాలను బయటకి తీద్దామని తీర్మానించుకున్నారు. వెంటనే మిగిలిన మత్స్యకారులను తీసుకుని నదిలో వేటకు బయలుదేరారు గ్రామస్థులు. విగ్రహాలు పడేసిన చోటవెతకగా.. లక్ష్మిదేవి, గణపతి విగ్రహాలు మాత్రమే దొరికాయి. ఆంజనేయస్వామి విగ్రహాం లభ్యం కాలేదు. దాని కోసం తీవ్రంగా గాలించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ రెండు విగ్రహాలను తీసుకొచ్చి స్థానికంగా ఉన్న గొట్ట పోలమ్మ ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.
కాగా.. నదిలో విగ్రహాలు దొరికాయి అని చుట్టు పక్కల ఊర్లకు సమాచారం పాకడంతో.. ఈ విగ్రహాలను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ఈ విగ్రహాలు ఏ లోహంతో తయ్యారు చేశారు? ఏ కాలం నాటివి? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ దేవుళ్ల విగ్రహాలను నదిలో నిమజ్జనం చేశారా? భూమిలో నుంచి బయటపడ్డాయా? అన్న విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదికూడా చదవండి: ఆ ఊర్లో మహిళలు గర్భం దాల్చాలంటేనే భయపడుతున్నారు..