Krishna Kowshik
వర్షాలు, వరదలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడను మరోసారి వానలు భయపెడుతున్నాయి. మరోసారి బుడమేరు వాగు వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు
వర్షాలు, వరదలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడను మరోసారి వానలు భయపెడుతున్నాయి. మరోసారి బుడమేరు వాగు వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు
Krishna Kowshik
ఇటీవల కురిసిన వర్షాలకు, వరదలకు విజయవాడ నగరం నీట మునిగిన సంగతి విదితమే. బుడమేరుకు గండి పడటంతో బెజవాడను ముంచేసింది వరద నీరు. ఊహించే లోపే ఊళ్లను ముంచేసింది. జల ప్రళయంలా విరుచుకుపడింది. దీంతో అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలైన డాబాకొట్లు, శాంతి నగర్, పైపుల్ రోడ్, ప్రకాష్ నగర్, నందమూరి నగర్, పాయకాపురం, కండ్రిక నీట మునిగాయి. న్యూ అండ్ ఓల్డ్ రాజరాజేశ్వరి పేటతో పాటు గుణదలలోని కొన్ని ప్రాంతాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరద నీరు ఒక్కసారిగా పోటెత్తడంతో డాబాలపైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. పైన వర్షం ఓ వైపు, కింద వరద నీరుతో అల్లాడిపోయారు. తిండి, నిద్ర లేక, బిడ్డలతో నానా అవస్థలు చూశారు. ఎన్నడూ చూడని విపత్తును బెజవాడ నగరం చూసింది. వరద నీరు తగ్గుతున్న క్రమంలో మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
బుడమేరుకు పడిన గండి పూడ్చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు, ప్రజలు. విజయవాడలో గ్యాప్ లేకుండా పడుతున్న వానలు నగర ప్రజలను నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు మరోసారి విజయవాడను భయపెడుతోంది ఈ వాగు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మళ్లీ బుడమేరుకు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజయవాడ మున్సిపల్ కమీషనర్ ధ్యాన చంద్ర రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముంపు ప్రాంతాలను వీడాలని కోరారు. వాగుకు మళ్లీ వరద నీరు వచ్చి చేరుతుందని, దీంతో ముప్పు పొంచి ఉందని, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు.
మరోవైపు ఇరిగేషన్ శాఖ అధికారుల సూచనల ప్రకారం బెజవాడ నగరంలోని బుడమేరు ప్రవాహ ప్రాంతాలైన రాజరాజేశ్వరి పేట, సింగనగర్, పరిసర ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ క్రమంలోనే నివాసాలను వీడి సురక్షితమైన ప్రదేశాలకు తరలి వెళ్లాలని, తమకు సహకరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశించారు. ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో ఉత్తరాంధ్ర అతలాకుతలం అవుతుంది. కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే కాకుండా ఇటు గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాను తడిపి ముద్ద చేస్తున్నాయి వానలు. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగావళి, వంశధార ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.