Dharani
Dharani
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ రెండు రోజుల పాటు పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వర్షాలు ఇలానే కొనసాగితే.. సెలవులు పొడగించే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అయితే అన్ని విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తించవు. కొన్ని జిల్లాలోని పాఠశాలలకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. ఆ వివరాలు..
భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏపీ సర్కార్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వర్ష ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలోని విద్యా సంస్థలకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపింది. దానిలో భాగంగా ఎన్టీఆర్, విశాఖ, నంద్యాల జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అలాగే ఏలూరు ఏజెన్సీ ప్రాంతాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం, బుట్టాయిగూడెంతో పాటూ పలు మండలాల్లో స్కూళ్లకు కూడా రెండు రోజుల పాటూ సెలువులు ప్రకటించారు. నంద్యాలలో నాలుగు రోజుల పాటూ పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.
ఇది కాక ఈ వారంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు మరో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. ఈ నెల 29వ అనగా శనివారం మొహర్రం పండగ ఉంది. దాంతో స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం ఉంటుంది . అలాగే కొన్ని ప్రాంతాల్లో జులై 28 శుక్రవారం నాడు మొహర్రం జరుపుకుంటారు. దాంతో వారికి ఆరోజున సెలవు ఉండే అవకాశం ఉంది. అలాగే జులై 30న ఆదివారం పాఠశాలకు, కాలేజీలకు సాధారణంగానే హాలిడే. దాంతో రాష్ట్రంలోని కొన్ని పాఠశాలలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవు ఉండొచ్చు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో జనాలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు.