iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు APPSC గుడ్ న్యూస్.. త్వరలోనే గ్రూప్- 1, 2 నోటిఫికేషన్లు!

నిరుద్యోగులకు APPSC గుడ్ న్యూస్.. త్వరలోనే గ్రూప్- 1, 2 నోటిఫికేషన్లు!

గ్రూప్ 1 తుది ఫలితాలను ఏపీపీఎస్సీ బోర్డు ఛైర్మన్ గౌతం సవాంగ్ విడుదల చేశారు. గ్రూపు-1కి సంబంధించి మొత్తం 110 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ప్రకటించారు. మిగిలిన 1 సీటుని స్పోర్ట్స్ కోటాలో ఉంటుదని వెల్లడించారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎంపిక ప్రక్రియను ఎంతో పారదర్శకంగా, రికార్డు టైమ్ లో పూర్తి చేసినట్లు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. మొదటిసారి సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ తో పరీక్షలు నిర్వహించామన్నారు. కేవలం 19 రోజుల్లో ప్రిలిమ్స్, 34 రోజులల్లోనే మెయిన్స్ ఫలితాలు విడుదల చేశామన్నారు.

1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసినట్లు గౌతమ్ సవాంగ్ తెలియజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో చాలా వరకు ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి వచ్చినవారే ఉన్నారన్నారు. తప్పుడు సర్టిఫికెట్లతో మోసం చేయడానికి ప్రయత్నించిన ఒక అభ్యర్థిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆ అభ్యర్థిపై క్రిమినల్ కేసు నమోదైనట్లు తెలియజేశారు. త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ బోర్డు ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. మొత్తం 16 శాఖలకు సంబంధించి 111 గ్రూప్ -1 ఉద్యోగాల కోసం ప్రకటించిన నోటిఫికేషన్ కు 1,26,450 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వీరిలో రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో 297 సెంటర్లలో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించగా 86,494 మంది (82.38 శాతం) అభ్యర్థులు హాజరయ్యారన్నారు. 27 జనవరి 2023న స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను విడుదల చేయగా 6,455 మంది ఉత్తీర్ణులు అయ్యారని పేర్కొన్నారు. అనంతరం 10 జిల్లా కేంద్రాల్లో 11 సెంటర్లలో నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు 4,688 మంది హాజరయ్యారని తెలిపారు.

గ్రూప్-1, 2 నోటిఫికేషన్:

ఈసారి సిలబస్ లో కీలక మార్పులతో నోటిఫికేషన్ ఉండబోతోందని గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. అందుకు ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. సిలబస్‌లో కీలక మార్పులతో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు గౌతమ్ సవాంగ్ తెలియజేశారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ ద్వారా 64 నోటిఫికేషన్లు విడుదల చేశామన్నారు. 17 ఏళ్ల తర్వాత యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని, ఏపీపీఎస్సీ ద్వారానే రిక్రూట్మెంట్ ప్రక్రియ జరుగుతుందన్నారు.