విమాన సర్వీసుల్లో అప్పుడప్పుడూ అంతరాయలు రావడం కామనే. బస్సు, రైల్వే లాంటి మిగతా రవాణా సర్వీసుల్లాగే ఫ్లయిట్ సర్వీసుల్లోనూ సమస్యలు ఏర్పడటం సర్వసాధారణమే. కొన్ని అనుకోని కారణాల వల్ల రోజుల పాటు విమాన సేవలు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏకంగా నెలల పాటు సర్వీసులు ఆగిపోవడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం విమానాశ్రయంలో ఐదున్నర నెలల పాటు రాత్రివేళ విమాన సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఈ ఐదున్నర నెలల కాలంలో 11 గంటల పాటు విమానాల రాకపోకలు రద్దు కానున్నాయి.
వైజాగ్ ఎయిర్‌పోర్టు భారత నావికాదళం అధీనంలో ఉన్న సంగతి తెలిసిందే. నేవీకి సంబంధించిన యుద్ధ విమానాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఐఎన్ఎస్ డేగా రన్‌వే నుంచే కార్యకలాపాలు సాగిస్తాయి. పౌర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కూడా ఈ రన్ వే మీదుగానే జరుగుతాయి. అయితే నావికాదళం ప్రతి పదేళ్లకు ఓసారి తమ రన్‌వేలకు రీ-సర్ఫేసింగ్ పనులను చేపడుతుంది. ఇందులో భాగంగా రన్‌వేపై మూడు పొరల్ని తొలగించి మళ్లీ కొత్తగా వేస్తారు. అలాగే అవసరమైన ఇతర పనులూ చేపడతారు. ఐఎన్ఎస్ డేగాలో చివరగా 2009లో రీ-సర్ఫేసింగ్ నిర్వహించారు.
ఐఎన్ఎస్ డేగాలో 2019లో రీ-సర్ఫేసింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ అది ఇప్పటిదాకా జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 15 నుంచి మార్చి నెలాఖరు దాకా రీ-సర్ఫేసింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. రాత్రి 9 గంటల నుంచి మర్నాడు పొద్దున 8 గంటల వరకు ఈ పనులను చేపడతారు. అందువల్ల ఆ టైమ్‌లో రన్‌వేను మూసేస్తారు. దీంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి ఈ 11 గంటల్లో విమానాల రాకపోకలను నిలిపివేస్తారు. ఫలితంగా విమానాల రాకపోకలకు దాదాపు 12 గంటల పాటు అంతరాయం కలగనుంది. వీటిల్లో ఢిల్లీ, హైదరాబాద్, పూణె, బెంగళూరు, కోల్‌కతా లాంటి దేశీయ విమానాలతో పాటు సింగపూర్‌కు వెళ్లే ఏకైక అంతర్జాతీయ సర్వీసు కూడా ఉంది. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నుంచి రోజకు 30 టేకాఫ్‌లు, 30 ల్యాండింగ్స్ జరుగుతున్నాయి.