iDreamPost
android-app
ios-app

దేశంలోనే మొదటి రైలు ప్రమాదం.. ఆ ఘటనకు 121 ఏళ్లు!

దేశంలోనే మొదటి రైలు ప్రమాదం.. ఆ ఘటనకు 121 ఏళ్లు!

రైలు ప్రమాదాలు అనేవి తరచూ జరుగుతూనే ఉంటాయి. సాంకేతిక సమస్య, పట్టాలు విరిగి పోవడం, వరదలు వంటి వివిధ కారణాలతో  రైలు ప్రమాదాలు జరుగుతుంటాయి. రైలు ప్రమాదాల కారణంగా భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఇప్పటి వరకు ఎన్నో రైలు ప్రమాదాలు జరిగి.. ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి అందరికి తెలిసిందే. ఆ ప్రమాదంలో దాదాపు 290 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దేశంలో అసలు తొలి రైలు ప్రమాదం జరిగింది.. 121 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు. మరి.. ఆనాటి విషాదం ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరి.. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలోనే మొట్టమొదటి రైలు ప్రమాదం జరిగి మంగళవారం నాటికి  సరిగ్గా 121 ఏళ్లు పూర్తయింది. ఈ ఘటన కూడ ఆంధ్రప్రదేశ్ లో వైయస్‌ఆర్‌ జిల్లా 1902లో దేశంలోనే తొలి రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదానికి గుర్తుగా ముద్దనూరు మండలం మంగపట్నం సమీపంలో స్తూపం ఏర్పాటు చేశారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ స్తూపం ప్రస్తుతం గండికోట వెనుక జలాల్లో ముంపునకు గురైంది.

స్వాతంత్రం రాక ముందు, ఆంగ్లేయులు పాలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మద్రాసు నుంచి ముంబయికి ప్రయాణికులతో ‘మెయిల్’ బయలు దేరింది. 1902 సెప్టెంబరు 12న వైయస్‌ఆర్‌ జిల్లా మంగపట్నం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.  అదే సమయంలో ఆ ప్రాంతంలో జోరుగా వర్షం కురిసింది. ఈ వరద నీటిలో మంగపట్నం సమీపంలోని రైల్వే వంతెన కొట్టుకుపోయింది. ఆ విషయాన్ని తెలియక.. మెయిల్ రైలు అదే దారిలో వెళ్లి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది విదేశీయులు, 61 మంది భారతీయులు మృతి చెందారు. ప్రమాదం జరిగిన మంగపట్నం ప్రాంతంలోనే  వారిని ఖననం చేసి..గుర్తుగా స్తూపాన్ని నిర్మించారు.

ఈ ప్రమాదంలో బెంగుళూరు కార్మెలైట్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ థెరిస్సా (సీఎస్‌ఎస్‌టీ) సంస్థ అధినేత్రి లీమా సిస్టర్‌  కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో భారత్‌లో దాదాపు వందకుపైగా పాఠశాలలు నడుస్తున్నాయి. ఆమె జ్ఞాపకార్థం 2003లో మంగపట్నం వద్ద ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఏర్పాటు చేశారు. థెలిస్సా లీమా జ్ఞాపకార్థం భారతీయ పోస్టల్‌ శాఖ వారు 2021 ఏడాది ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను విడుదల చేశారు. ఈ ఘటన జరిగి 121 ఏళ్లు కావడంతో మంగళవారం లీమా స్తూపం వద్ద  పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.