iDreamPost

ఘోర విషాదం: బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య!

ఘోర విషాదం: బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య!

నేటికాలంలో మనుషుల్లో ఆత్మవిశ్వాసం అనేది కొరవడింది. అందుకే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు చావే పరిష్కారంగా భావిస్తుంటారు. ఇలా తరచూ ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే కొన్ని ఆత్మహత్యలు ఎన్నో అనుమానాలను కలిగిస్తుంటాయి. తాజాగా విశాఖపట్నంకి చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు విజయనగరం జిల్లాలోని ఓ బావిలో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రెండు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

విశాఖపట్నంలోని మర్రిపాలెంలోని ఎఫ్‌సీఐ కాలనీ ప్రాంతంలో మహమ్మద్‌ సయ్యద్‌ మొహినుద్దీన్‌(46), సంష్ నీష్(39) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఫాదిమాజెహ్రు(17) అనే కుమార్తె, సాహిద్ అలీ  అనే కుమారుడు ఉన్నాడు. కుమార్తె డిగ్రీ చదువుతుండగా, కుమారుడు వేరే ప్రాంతంలో ఎంబీఏ చదువుతున్నాడు. మొహినూద్దీన్ షిప్పింగ్‌ సంబంధిత సామగ్రి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారికి కొత్తవలస మండలంచింతలపాలెం సమీపంలోని ఓ లేఔట్‌లో కొంత స్థలం ఉంది.  సోమవారం రాత్రి భార్య, కుమార్తెతో కలిసి కలిసి ఆయన లేఔట్‌ వద్దకు వెళ్లారు. ఆ తరువాత సమీప వ్యవసాయ బావిలో దూకి ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు, చెల్లి ఇంటికి రాకపోవడం, ఆస్తుల సమాచారం చరవాణిలో పంపించడంతో కుమారుడు అలీకి అనుమానం వచ్చింది.

దీంతో అలీ.. తన మేనమామ ఎస్‌.కె.ఎం.సుభాని తదితరులు చింతలపాలెం వచ్చి రాత్రంతా వెతికారు. లొకేషన్‌ ఆధారంగా రాత్రి 11.50 సమయంలో మృతుడి చరవాణిని ఘటనా స్థలంలో గుర్తించారు. మంగళవారం ఉదయం బావిలో ఉన్న మృతదేహాలను కుమారుడు, బంధువులు గుర్తించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటనేది తెలియరాలేదు.  మృతుడి కుమారుడు సాహిద్‌ అలీ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. బావి వద్ద చాకు, ముగ్గురు పేర్లు, చరవాణి నంబర్లు రాసి ఉన్న కాగితం, మృతుడి చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలోని మర్రిపాలెం నుంచి ఇక్కడకొచ్చి ఆత్మహత్య చేసుకోవడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మరి.. ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి