Dharani
Dharani
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ట్రాన్స్‌స్టాయ్ కంపెనీ డైరెక్టర్లు, ఇళ్ళు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ గతంలోనే ట్రాన్స్‌స్టాయ్ కంపెనీ మీద కేసు నమోదు చేసింది. దీని విచారణలో భాగంగానే నేడు ఈడీ అధికారులు.. రాయపాటి నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్‌స్టాయ్ వ్యవహారానికి సంబంధించిన పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
హవాలా, మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో.. రాయపాటి ఇల్లు, కంపెనీలలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. రాయపాటి కంపెనీ, నివాసంతో పాటు 15 చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఈ కంపెనీకి చెందిన పలువురి ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాక గుంటూరు, హైదరాబాద్‌లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 13 బ్యాంకుల నుంచి రూ.9,394 కోట్లు రుణాలు తీసుకుని ఎగ్గొట్టారనే ఆరోపణలపై కేసు నమోదైంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వ్యక్తిగత అవసరాలకు వాడినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ఇప్పటికే రాయపాటి సాంబశివరావుపై సీబీఐ కేసు నమోదు చేయగా.. ఆ కేసు ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. పలు కంపెనీల్లో ఆయన పెట్టిన పెట్టుబడులు గుర్తించినట్లు తెలుస్తోంది. రాయపాటి సాంబశివరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ లో రోడ్ నెంబర్ 27 లో రాయపాటి నివాసంతో పాటు, గుంటూరులోనూ ఈడీ అధికారులు తనిఖీలు సాగిస్తున్నారు. ట్రాన్స్‌స్టాయ్ కంపెనీ బ్యాంకు ఖాతాల నుండి నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్‌కు నగదు బదిలీ అయినట్టుగా ఈడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ఏకకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈడీ దాడులు కొనసాగుతున్నాయి.