iDreamPost
android-app
ios-app

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం.. అమ్మవారి అలంకారాల్లో మార్పులు!

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం.. అమ్మవారి అలంకారాల్లో మార్పులు!

నేటి నుంచి దేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 24 వరకు నవరాత్రులు జరుపుకోనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలు విద్యుకాంతులతో ముస్తాబయ్యాయి. అలానే ఏపీలోని ప్రముఖ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కనక దుర్గమ్మ ఆలయంలో దేవి నవరాత్రులు వైభవంగా జరగనున్నాయి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వారి అలంకారాల్లో మార్పులు చేశారు. మరి.. ఆ మార్పులు ఏమిటో చూద్దాం..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 15 నుంచి తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. దసరాలో మొదటిసారిగా శ్రీ మహాచండి దేవి దర్శనం ఉంటుందని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు శంకర్ శాండిల్య తెలిపారు. అక్టోబర్‌ 15 వ తేదీన ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. సాధారణంగా నవరాత్రుల్లో తొలిరోజు కనక దుర్గాదేవి వాస్తవంగా  స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ  స్థానంలో శ్రీ మహాచండి అలంకారం రూపంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

అంతేకాదు దసరా పండగ రోజున అమ్మవారు రెండు  అవతారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దసరా పండగ  రోజు ఉదయం శ్రీమహిషాసురమర్దినిగా.. మధ్యాహ్నం నుండి శ్రీరాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. 16న శ్రీ గాయత్రీ దేవి అలంకారం,17 న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం,18 న శ్రీ మహాలక్ష్మి దేవి, 19న శ్రీ మహా చండీ దేవి అలంకారంలో దుర్గమ్మ కనిపించనున్నారు. నవరాత్రుల్లో ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున చదువుల తల్లి సరస్వతి దేవిగా దుర్గమ్మ కనిపించనుంది. ఈ ఏడాది నవరాత్రుల్లో 20 వ తేదీ మూలా నక్షత్రం వచ్చింది. ఈ రోజున అమ్మవారికి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. నవరాత్రుల్లో తొలి రోజున అమ్మవారి దర్శనం కోసం తెల్లవారు జామున 4 గంటల నుండే ఇంద్రకీలాద్రికి  భక్తులు క్యూ కట్టారు. మరి.. దుర్గమ్మ 9 రోజుల్లో 10 అవతారాల్లో కనిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.