iDreamPost
android-app
ios-app

లిఫ్ట్ అడగటం ఆమె పాలిట శాపమైంది.. తమకు లొంగలేదని

లిఫ్ట్ అడగటం ఆమె పాలిట శాపమైంది.. తమకు లొంగలేదని

ఒకప్పుడు ఆడది అంటే వంటింటి కుందేలుగా చూశారు, మార్చారు. బాహ్య ప్రపంచం తెలియకుండా భర్త, పిల్లలు, సంసారం అంటూ ఇంటికే పరిమితమయ్యేది. తన జీవితానికి తానే గిరిగీసుకుని ఉండిపోయేది ఇల్లాలు. అయితే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా మారాయి. ఆర్థికంగా ఎదిగే స్థాయికి చేరింది వనిత. మగవారితో పోల్చితే ఎందులోనూ తీసిపోము అని నిరూపిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా పురుషుల అహంకారానికి, ఆక్రోశానికి, అక్కసుకు, వక్ర బుద్ధికి బలౌతూనే ఉన్నారు. తనకు లొంగని ఆడవాళ్ల పట్ల అరాచకానికి దిగుతూ రాక్షస ఆనందం పొందుతున్నారు. కానీ ఏ పాపం ఎరుగుని మహిళలు మాత్రం అందరి నోట్లో అభాసు పాలు అవుతూ.. చివరికి జీవితం వ్యర్థం అనుకుని.. ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. పావని విషయంలోనూ ఇదే జరిగింది.

భీమడోలు మండలం లక్ష్మీపురానికి చెందిన సుంకర లక్ష్మణరావు, దెందులూరుకు చెందిన పావని భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భర్త చేపలు పట్టుకుని, వాటిని అమ్మి జీవనం సాగిస్తుంటారు. అయితే పిల్లల చదువుల కోసమని గుండుగొలనులోని గంగానమ్మ గుడి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 15న పావని..ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని (చిన్న తిరుపతి) దర్శించుకునేందుకు బయలు దేరింది. అయితే అటుగా వస్తున్న ఓ మోటారు సైక్లిస్ట్‌ను లిఫ్ట్ అడిగింది. అయితే లక్ష్మీపురానికి చెందిన పాత నేరస్తుడు బోను శివ కృష్ణ ఆమె మరొకరి బైక్ ఎక్కడం చూసి, తన సెల్ ఫోనులో చిత్రీకరించాడు. తన స్నేహితులైన బోను పవన్, సుంకర యశ్వంత్, రాజబాబుతో కలిసి బైక్ పై వెళుతూ ఆమెను వెంబడించారు.

కొంత దూరం పోయాక.. పావనిని అడ్డగించి.. తమ కోరిక తీర్చాలని లేదంటే వీడియోను వైరల్ చేస్తామంటూ బెదిరించారు. అయినా ఆమె లెక్కచేయకుండా వెళ్లిపోయింది. దీంతో ఆమెపై అక్కసు పెంచుకున్న శివకృష్ణ ఆ వీడియోను ఆమె అత్తగారి ఊరైనా లక్ష్మీపురంలోని అందరికీ షేర్ చేశాడు. ఆమె వ్యభిచారిగా అవతారం ఎత్తిందంటూ ప్రచారం చేశాడు. ఈ విషయం పావని వద్దకు చేరడంతో మనస్థాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పావని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పావని మరణానికి కారణమైన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించింది.