Krishna Kowshik
ఒక్క అనుమానం.. అపోహ హత్యకు దారి తీయడమే కాకుండా.. అతడి భవితవ్యాన్నినాశనం చేసింది. అలాగే భర్త తన కళ్ల ముందే చనిపోవడాన్ని చూసిన భార్య..
ఒక్క అనుమానం.. అపోహ హత్యకు దారి తీయడమే కాకుండా.. అతడి భవితవ్యాన్నినాశనం చేసింది. అలాగే భర్త తన కళ్ల ముందే చనిపోవడాన్ని చూసిన భార్య..
Krishna Kowshik
భార్యా భర్తలిద్దరిదీ అన్యోన్య దాంపత్యం. ఇద్దరూ విద్యా రంగంలోనే కొనసాగుతున్నారు. కొన్ని గంటల వ్వవధిలోనే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. కక్ష, కార్పణ్యాల కారణంగా ఒకరు మరణిస్తే.. ఆ బాధను తట్టుకోలేక మరొకరు కన్నుమూశారు. కేవలం ఒక చిన్న అపోహ భర్తను ఆమెకు దూరం చేసింది. ఆ వేదనలోనే భార్య కూడా ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయింది. అనంతపురంలో జరిగిన ఈ ఘటనలు ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపాయి. ఈ దంపతుల మృతికి నివాళులర్పించేందుకు స్నేహితులు, ప్రొఫెసర్లు, కళాశాల విద్యార్థులు బారులు తీరారు. సొంత మేనల్లుడి చేతిలోనే కళాశాల ప్రిన్సిపాల్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా పామిడికి చెందిన మూర్తిరావు ఖోకలే జేఎన్టీయూఏలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన ఆయన.. పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం అనంత లక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య శోభ.. శ్రీ సత్య సాయి జిల్లా తాడిమర్తి మండలంలోని ఓ జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కొడుకు, కూతురు ఉజ్వల్, వైష్ణవి. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. జేఎన్టీయూఏ సమీపంలో ఎప్పటి నుండో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. మూర్తిరావు తన ఇళ్లు అద్దెకు ఇచ్చి.. నగరంలోని ఓ అపార్ట్ మెంట్‌లో నివాసముంటున్నారు. వివాద రహితుడు, సౌమడ్యుడిగా మూర్తిరావుకు మంచి పేరుంది.
హాయిగా సాగుపోతున్న జీవితంలోకి యముడు మేనల్లుడు రూపంలో దాపురించారు. మేనమామపై కోపంతో.. పక్కా ప్లాన్ గీసి చంపేశాడు మేనల్లుడు ఆదిత్య. బ్యాచ్ లర్ అని మూర్తిరావు ఇంటికి ఎదురుగా అద్దెకు దిగి.. ప్లాన్ అమలు చేశాడు. ప్రిన్సిపాల్ ఇంట్లో అద్దెకున్న మణికంఠ ఆదివారం ఇల్లు ఖాళీ చేసి మూర్తిరావుకు ఈ విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు. ఖాళీ చేసిన ఇంటిని చూసుకుని తాళాలు తీసుకెళ్లాల్సిందిగా కోరడంతో.. భార్యతో కలిసి అక్కడకు వెళ్లాడు. ఇంటిని పరిశీలిస్తూ శోభ లోపలకు వెళ్లింది. అదే సమయంలో అక్కడే పొంచి ఉన్న ఆదిత్య.. లోపలకు చొరబడి కత్తితో మూర్తిరావు గొంతులోకి పొడిచాడు. భార్య కళ్ల ముందే ఈ దారుణం జరిగింది. దీంతో ఆమె కేకలు వేస్తూ బయటకు పరుగు తీసింది. అప్పటికే మూర్తిరావు మృతి చెందాడు.
చంపిన అనంతరం ఆదిత్య ఇంటి వెనుక ఉన్న బాత్రూమ్‌కు వెళ్లి చేతికి అంటిన రక్తాన్ని శుభ్రం చేసుకుని, మృతదేహం పక్కనే కూర్చుండి పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని ఆదిత్యను అదుపులోకి తీసుకున్నారు. తమ కుటుంబాన్ని ఎదగనీయకుంండా మామ చూస్తున్నారని, తనకు పెళ్లి సంబంధాలు రాకుండా అడ్డుకుంటున్నారనే అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన కళ్ల ఎదుటే భర్త హత్యకు గురి కావడంతో భరించలేకపోయిన భార్య.. గుండె పోటుతో మరణించింది. ఈ రెండు మరణాలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వీరి మృతదేహాలను కడసారి చూసేందుకు బారులు తీరారు అధ్యాపకులు, కాలేజీ విద్యార్థులు.