Dharani
పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల కల సాకారం అయ్యే తరుణం వచ్చేసింది. వారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న వరికపూడిశెల ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. ఆ వివరాలు..
పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల కల సాకారం అయ్యే తరుణం వచ్చేసింది. వారు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న వరికపూడిశెల ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. ఆ వివరాలు..
Dharani
నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా అత్యంత కరువుతో ఇబ్బంది పడుతున్న మెట్ట ప్రాంతాలు పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, ప్రకాశం జిల్లాలోని పుల్లల చెరువు మండలాలు. పక్కనే నాగార్జున సాగర్ వంటి భారీ ప్రాజెక్ట్ ఉన్నా సరే.. ఈ ప్రాంతాల్లో మాత్రం కరువు విలయతాండవం చేసేది. సాగునీరే అనుకుంటే.. తాగునీటికి సంబంధించి మరో రకమైన కష్టం. ఈ మండలాల్లో త్రాగునీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండేది. దాంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో జనాలు ఇబ్బంది పడేవారు. ఇక ఇక్కడ 1000-1500 అడుగుల వరకూ బోర్లు వేసినా సరిగ్గా నీరందని దుస్థితి ఈ మండలాల్లో ఉండేది. ఈ సమస్యకు పరిష్కారం వరికపూడిశెల ప్రాజెక్ట్. దీని కోసం ఆరు దశబ్దాలుగా ఇక్కడి జనాలు ఎదురు చూస్తున్నారు.
పల్నాడు ప్రజల ఆరు దశాబ్దాల ఎదురు చూపులకు నేటితో అనగా నవంబర్ 15తో తెర పడనుంది. వారి కల వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శంఖుస్థాపన చేయనున్నారు. అయితే ఈ కల సాకారం అవ్వడం వెనక ప్రధాన కారకులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎంపీ కృష్ణ దేవరాయలుగా చెప్పవచ్చు. మూడు సార్లు శంఖుస్థాపన చేసుకున్నప్పటికి.. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి ప్రగతి సాధించలేదు. ఈ క్రమంలో 2019 ఎన్నికల సమయంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరికపూడిశెలను సాధించకపోతే.. ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. అన్నట్లుగానే.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. ఎంపీ కృష్ణదేవరాయలతో కలిసి ప్రాజెక్ట్ సాకారం కోసం అన్ని రకాలు ప్రయత్నాలు చేశారు.
వారి కృషి ఫలితంగా ప్రాజెక్ట్‌కు ప్రతిబంధంకంగా ఉన్న అటవీ, పర్యావరణ అనుమతులు రావడంతో.. ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది. ఈ క్రమంలో వరికపూడిశెల ఎత్తిపోతల తొలి దశ పనులను చేపట్టేందుకు బుధవారం సీఎం జగన్ మాచర్లలో శంఖుస్థాపన చేయనున్నారు. రూ.340.26 కోట్లతో తొలి దశ పనులు చేపట్టనున్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదిన పూర్తి చేసి.. పూర్తిగా పైపులైన్ల పద్దతి ద్వారా సుమారు 24,900 ఎకరాలకు నీళ్లందించనున్నారు.
నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నియమించిన ఖోస్లా కమిటీ ఈ ప్రాంతానికి ప్రత్యేక రాయతీలు ఇచ్చి కరువు బారి నుండి కాపాడమని, త్రాగు సాగు నీటి వసతి ఏర్పాటు చేయాలని సిఫార్స్ చేసింది. దానిలో భాగంగా ఎగువ పల్నాడుకి త్రాగు, సాగు నీటి కోసం వరికపూడిశెల వద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించాలని అప్పుడే నిర్ణయించారు. నాటి నుంచీ సుమారు ఆరు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు కోసం పల్నాడు ప్రాంతవాసులు ఎదురు చూడసాగారు.
ఈ క్రమంలో 1995 లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత 05-03-1996న శిరిగిరిపాడు గ్రామం దగ్గర వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ తరువాత ఆయన అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లు ఆ ప్రాజెక్ట్‌ను పట్టించుకోలేదు. ఇది జరిగిన 13 సంవత్సరాల తరువాత అనగా.. 2008,సెప్టెంబర్ నెలలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గంగలకుంట దగ్గర ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన చేసి 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు.
ఆ సందర్భంగా వైఎస్సార్ మాట్లాడుతూ.. ‘‘బచావత్ అవార్డు ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కు 10 వేల ఎకరాల సాగునీటి అనుమతి ఉన్నది. కనుక దీన్ని క్రమ క్రమంగా విస్తరించి, ఈ నాలుగు మండలాలకి త్రాగునీరు, సాగు నీరు అందిస్తామని’’ తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగిన కొద్ది కాలానికే ఆయన మరణించారు. ఆ తరువాత వచ్చిన పాలకులు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం కలగానే మిగిలింది.
ఆ తర్వాత 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏకంగా ప్రాజెక్టు కలల్ని కల్లలు చేసే ప్రయత్నం చేశాడు. నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అసెంబ్లీ వేదికగా వరికపూడిశెల నిర్మాణం గురించి టీడీపీ ప్రభుత్వాన్ని పదే పదే ప్రశ్నించగా ఆ ప్రాజెక్టుకి కేంద్ర పర్యావరణ అనుమతులు ఇవ్వట్లేదని అందువలన ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన విరమించుకొంటున్నామని 30-07-2015 న అసెంబ్లీ వేదికగా చంద్రబాబు స్పష్టం చేశారు.
అనంతరం ఎన్నికలకు సమయం దగ్గర పడ్డ వేళ.. అనగా 08-07-2018 న మాచర్లలో పర్యటించిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బహిరంగ సభలో మాట్లాడుతూ.. యుద్దప్రాతిపదికన వరికపూడిశెల ప్రాజెక్టు పనులు మొదలుపెడతామని తెలిపారు. తరువాత ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు కేంద్ర పర్యావరణ, వన్యప్రాణి రక్షణ, అటవీ శాఖల అనుమతులు ఏవీ లేకుండానే.. 06-02-2019న ప్రాజెక్టు నిర్మాణానికి 340 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో విడుదల చేసి మరోసారి శంఖుస్థాపన చేశారు చంద్రబాబు.
అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆ కథ అక్కడితో ముగిసింది. అయితే 2019 నుంచి వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేస్తున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, నరసరావుపేట ఎంపీ కృష్ణ దేవరాయలు.. సీఎం జగన్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాల్లో చర్చలు జరపడంతో.. చివరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అనుమతులని ఇచ్చింది. దాంతో ప్రాజెక్ట్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు అన్నీ తొలగినట్లయింది. చివరకు అన్ని అనుమతులతో బుధవాంర అనగా 15-నవంబర్-2023 న సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టు శంఖుస్థాపన జరగనుండడంతో పల్నాడు ప్రాంతంలో పండుగ వాతావారణం నెలకొంది. 60 ఏళ్ల తమ కలని సాకారం చేసిన ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పిన్నెల్లిపై జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వారికి జేజేలు పలుకుతున్నారు పల్నాడు ప్రాంత వాసులు.