చరిత్రలో ఎందరెందరో నాయకులు ఉన్నారు. కానీ చరిత్ర గతిని మార్చిన గొప్ప లీడర్స్ మాత్రం కొందరే ఉన్నారు. అలాంటి అరుదైన నాయకుల జాబితాలో ముందు వరుసలో ఉంటారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. విపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ఆయనది ఎప్పుడూ ప్రజాపక్షమే. పవర్ అంటే శాసించడం కాదు, ప్రజల బాధలను తీర్చడం అని ఆయన నిరూపించారు. వ్యవసాయం దండగ అన్న వేళ.. రైతును రాజుగా చేశారు వైఎస్సార్. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, పశుపోషణ, పట్టు, పండ్ల తోటలు, డ్రిప్, స్ప్రింకర్ల రైతులకూ చేయూతను అందించడంతో ఈ రంగాలూ గాడినపడ్డాయి.
ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. పేదల బాగు కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ‘ఆరోగ్య శ్రీ’ స్కీమ్‌ను తీసుకొచ్చారు. విద్యార్థుల చదువుల కోసం ‘ఫీజు రీయింబర్స్మెంట్’ను ప్రవేశపెట్టారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ‘జలయజ్ఞం’ను ప్రారంభించిన ఘనత కూడా రాజశేఖర్ రెడ్డికే దక్కుతుంది. అన్నదాతలకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు సహా ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. ఇలా ఎన్నో స్కీముల ద్వారా అందరి గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా నిర్వహిస్తూ ఆ మహనీయుడ్ని స్మరించుకుంటోంది. వైఎస్సార్ 74వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు అర్పించనున్నారు. ఇదిలా ఉండగా.. తండ్రి జయంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ జగన్ ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. వైఎస్సార్ నిరంతరం ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని తపించారని జగన్ ట్వీట్లో రాసుకొచ్చారు. ఆ తపనే ప్రజల హృదయాల్లో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసిందన్నారు జగన్. ఆశయాల సాధనలో వైఎస్సార్ స్ఫూర్తి తనను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోందన్నారు జగన్. ఈ జయంతి తమందరికీ ఒక పండుగ రోజు అని ట్వీట్లో పేర్కొన్నారాయన.
ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక… pic.twitter.com/KsdlyNd2uM
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 7, 2023